అనిల్ అంబానీ, చంద్రబాబు భేటీ వెనుక ఆంతర్యం అదేనా..!

 

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ ‌అంబానీ ఏపీ రాజధాని అమరావతిని సందర్శించారు. ముందు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు అంబానీకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబుతో ఆయన అమరావతి సచివాలయంలో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో పవర్‌ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు తదితర అంశాలపై అనిల్ అంబానీ సీఎంతో చర్చించినట్టు సమాచారం. అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా.... రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుంచి వైదొలగిన తరవాత మోడీ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపు ఇచ్చారు కూడా.

 

కాగా కొన్ని రోజుల క్రితం అనిల్‌ అంబానీ అన్న ముకేష్‌ అంబానీ చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముకేష్ అంబానీ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన సంగతి కూడా విదితమే. చంద్రబాబు ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని ఉన్నారు. దీంతో ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబుకు పీఎం పదవి కరెక్ట్ అని ముకేష్ అంబానీ అన్నారని పలు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు బాబు, ముకేష్ భేటీ తరవాతే చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు వచ్చిందని..మోడీ పై బాబు దాడి తీవ్రం చేశారని... అన్నారు. ఇక ఇప్పుడు అనిల్‌ అంబానీతో భేటీ అయ్యారు. రాఫెల్‌ డీల్‌ విషయంలో మోడీ-అనిల్ బంధం పై కాంగ్రెస్‌ ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పక్షంలో మోడీ వ్యతిరేక వర్గం మరింత బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు వైపు కాంగ్రెస్, బీజేపీ యేతర పక్షాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు-అనిల్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ తరఫున అనిల్‌ అంబానీ రాయబారం నెరుపుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. కానీ..  అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే... అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) గ్రూప్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను చేపట్టారు. అయితే, ఈ ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ, చంద్రబాబుతో భేటీ అవుతున్నారని చెబుతున్నారు. చూద్దాం మరి వీరి భేటీ వెనుక అసలు రహస్యం ఏంటో..