పోలవరంపై రంగంలోకి కేంద్రం... జగన్ సర్కారుకి షాక్ తప్పదా?

 

జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. పోలవరం రివర్స్ టెండరింగ్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు జాప్యంతోపాటు నిర్మాణ వ్యయం పెరుగుతుందని ఒకవైపు పోలవరం అథారిటీ చెప్పినా, మరోవైపు కేంద్రం హెచ్చరించినా వినకుండా పాత కాంట్రాక్టును రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవడంపై మండిపడింది. పోలవరం కాంట్రాక్టు రద్దును పార్లమెంట్ సాక్షిగానే తప్పుబట్టిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.... తాజా పరిణామాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పోలవరం అథారిటీని ఆదేశించారు. అసలు రివర్స్ టెండరింగ్ కి దారి తీసిన కారణాలేంటో చెప్పాలని సూచించింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ...నివేదికపై కసరత్తు మొదలుపెట్టింది.

అయితే, పోలవరం కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్ పై గుర్రుగా ఉన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్... అన్నీ గమనిస్తున్నాం... ఏం జరుగుతుందో చూద్దామంటూ జగన్ ప్రభుత్వానికి దాదాపు హెచ్చరిక సంకేతాలు పంపారు. అయితే, రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని విరమించుకోవాలని... అటు కేంద్రం... ఇటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా ఖాతరు చేయకుండా, కనీసం కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా జగన్ సర్కారు కొత్త టెండర్లు పిలుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడంతో... మొత్తం పరిణామాలపై కేంద్ర జలవనరులశాఖ నివేదిక కోరడం కీలకంగా మారింది.

మొత్తానికి, పోలవరం వివాదంపై రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎంతమేర జరిగింది? ఎంతమొత్తంలో బిల్లులు చెల్లించాలంటూ పలు అంశాలపై నివేదిక కోరింది. అయితే, పోలవరం ప్రాజెక్టు అథారిటీ నివేదిక తర్వాత జగన్ సర్కారు షాకిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశముందనే మాట వినిపిస్తోంది.