రూ.705 కోట్ల కుంభకోణం.. జీవీకే రెడ్డి, ఆయన కుమారుడిపై సీబీఐ ఎఫ్ఐఆర్

ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేశారంటూ జీవీకే గ్రూప్ కంపెనీల చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ గునుపాటి వెంకట సంజయ్ రెడ్డి, కొన్ని ఇతర సంస్థలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపైన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో.. 2012-18 మధ్య రూ. 705 కోట్లను అక్రమంగా వాడుకున్నారంటూ సీబీఐ ఆరోపించింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్ రెడ్డితో పాటు మరో 12 సంస్థలపైనా కేసు నమోదైంది. ఈ మేరకు జూన్ 27 రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సీబీఐ బుధవారం ముంబయి, హైదరాబాద్‌లలో జీవీకే రెడ్డి, ఆయన కుమారుడికి చెందిన కార్యాలయాలు.. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని పలు కార్యాలయాలు సహా మొత్తం 6 ప్రదేశాలలో సోదాలు చేసింది. 

ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(ఎంఈఎఎల్) అనేది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరికొన్ని విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్. ముంబయి విమానాశ్రయ అభివృద్ది, నిర్వహణ, నవీకరణ కోసం దీన్ని ఏర్పాటుచేశారు. ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 50.5 శాతం కాగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా 26 శాతం. ఈ వెంచర్ సంస్థ‌పై వచ్చే ఆదాయంలో వార్షిక రుసుముగా 38.7 శాతం మొత్తాన్ని ఎంఏఈఎల్ ఏఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సి ఉంటుంది. సీబీఐ ఆరోపణల ప్రకారం ప్రధానంగా అవినీతి ఇక్కడే జరిగింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఇందుకోసం 9 ప్రయివేటు సంస్థలను వాడుకుందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఇలా రూ. 310 కోట్ల నిధులను దారి మళ్లించి ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కు జీవీకే వినియోగించుకుందని సీబీఐ ఆరోపించింది. జీవీకే గ్రూప్ కంపెనీ ప్రతినిధుల నేరపూరిత చర్యల వల్ల ఏఏఐ తీవ్రంగా నష్టపోయిందని, ఎంఐఏఎల్ వద్ద ఉన్న రూ. 395 మిగులు నిధులను జీవీకే అనుబంధ కంపెనీల్లోకి తరలించారని పేర్కొంది. జీవీకే కారణంగా రూ. 705 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి.