లోకేశ్ vs కేటీఆర్ పోటాపోటీ నోటీసులు

 

ఓటు నోటు కోసులో ఇప్పటికే ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై అనేక కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో అంశం చర్చాంశనీయమైంది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఎంతో మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై రెండు ప్రభుత్వాలు పోటా పోటీగా నోటీసులు జారీ చేసే పనిలో పడ్డాయి. తెలంగాణ ఏసీబీ ప్రభుత్వం టిడిపీ యువనేత లోకేశ్ డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి చెంప దెబ్బ కొట్టినట్టు ఏపీ ప్రభుత్వం తెలంగాణ మంత్రి కెటిఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు ఏపీ సీఐడి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. మత్తయ్య బెదిరింపుల కేసులో కెటిఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిద్దమయ్యారు.

 

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2013లో విశాఖ జిల్లా పెందుర్తిలో నమోదైన హత్యాయత్నం కేసు ఘటన తెరపైకి రావడం గమనార్హం. గతంలో ఈకేసుకు సంబంధించి సిఎం కెసిఆర్ వ్యక్తిగత గన్‌మెన్ మధుసూదన్ రెడ్డి, మరో వ్యక్తి సతీష్ రెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి కానీ విచారణకు రాలేదు. అయితే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ నేరుగా నోటీసులు హైదరాబాదుకు తెచ్చి ఇచ్చింది. దీనిలో భాగంగా వారికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారు అందుబాటులో లేకపోవడంతో నేరుగా వారి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి నోటీసులు అందజేసింది. మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే నోటుకు ఓటు కేసులో పోటా పోటీగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు బయట వచ్చిందా అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ఓటు నోటు కేసు సంగతేమో కాని ఈ కేసు నేపథ్యంలో ఇంకెన్ని కేసులు బయటపడతాయో.. ఎంతమందికి నోటీసులు వెళతాయో చూడాలి.