తాళ్లాయపాలెంలో రాజధానికి శంఖుస్థాపన?
posted on May 22, 2015 9:40AM
వచ్చే నెల ఆరవ తేదీన ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంఖుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలనే విషయం కూడా ఇప్పుడు దాదాపు ఖరారు అయింది. దీని కోసం క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు, వాస్తు పండితులు రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో శ్రీశైవ క్షేత్రమనే పుణ్యస్థలి, ఆ పక్కనే కృష్ణా తీరం కూడా ఉన్నందున తుళ్లూరు మండలంలో తాళ్లాయపాలెం గ్రామంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అన్నివిధాల మంచిదని ప్రభుత్వానికి సూచించారు. రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంతంలోనే అనేకమంది రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చేరు గనుక తాళ్లాయపాలెంలోనే శంఖుస్థాపన చేసినట్లయితే ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం పూర్తి అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈరోజు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అధికారుల చేసిన ఈ ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదముద్ర పడగానే తాళ్లాయపాలెంలో శంఖుస్థాపనకు అవసరమయిన ఏర్పాట్లు చేయడం మొదలుపెడతారు.