హరీష్ రావు రాజీనామా.. త్వరలో సిద్దిపేటకు బై ఎలక్షన్‌!!

 

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. తనతో పాటు హరీష్ రావుని కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. హరీష్ రావు చేత ఎమ్మెల్యేగా రాజీనామా చేయించి.. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూర్చే వార్త ఒకటి బయటికొచ్చింది.

సీఎం కేసీఆర్‌ అన్న కూతురు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్‌. రమ్యారావు తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో ‘తాజా తెలంగాణ’ పేరుతో ఒక ఆసక్తికరమైన పోస్టు చేశారు. ‘మరో 4 నెలల్లో సిద్దిపేటకు బై ఎలక్షన్‌. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత’అని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గానికి  హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక తన్నీరు శ్రీనిత.. హరీష్ రావు సతీమణి. హరీశ్‌రావు సతీమణి పొలిటికల్ ఎంట్రీ అంటూ రమ్యారావు చేసిన పోస్టింగ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. కాంగ్రెస్‌ నాయకురాలు రమ్యారావు హరీష్ రావుకి దగ్గరి బంధువు. దీంతో ఆమె తమ పార్టీ వాట్సాప్‌ గ్రూపులో చేసిన పోస్టుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌..  హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయిస్తారనే ప్రచారం మరింత ఊపందుకుంది.