దొంగని పట్టిచ్చిన గేదె

 


గేదె పాలు ఇవ్వడం మాత్రమే కాదు.. పారిపోతున్న దొంగలను కూడా పట్టిస్తుంది. నమ్మలేకపోతున్నారా? నిజంగానే ఓ గేదె దొంగని పట్టించింది. ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో జరిగింది. ఈ మండలంలోని మన్నెంవారిపల్లె గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని ప్రవేశించారు. ఇంట్లో వున్న వారిని బెదిరించి వారి దగ్గర వున్న నగలు, నగదును దోచుకున్నారు. ఇంతలో ఆ ఇంట్లోవారు కేకలు వేయడంతో దొంగలు పరుగు అందుకున్నారు. అయితే ఆ ఇంటి ఆవరణలో కట్టేసి వున్న ఒక గేదె ఆ దొంగల్లో ఒకడిని కసిదీరా పొడిచింది. దాంతో అతను అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. మిగతావారు పారిపోయారు. పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతను కోలుకున్న తర్వాత అతని ద్వారా మిగతా దొంగల ఆచూకీ తెలుసుకుంటామని చెబుతున్నారు.