కాంగ్రెస్ తో పొత్తు లేదు

 

లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయం లేకపోవడంతో.. ఈలోపు కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.. ఈ ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు ఎలాగైనా గెలవాలని ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి.. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీని ఓడించడానికి ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధం అన్నట్టు సంకేతాలు ఇచ్చింది.. బీజేపీ కూడా మళ్ళీ మిత్రపక్షాలను కలుపుకునే పనిలో ఉంది.. ప్రస్తుతం అందరి దృష్టి మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ఉంది.. త్వరలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుండగా..

కాంగ్రెస్ మాత్రం బీజేపీ ని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమైంది.. దానిలో భాగంగానే కాంగ్రెస్,బీఎస్పీల మధ్య పొత్తు కుదిరిందని, వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని వార్తలొచ్చాయి.. కానీ ఈ వార్తల్లో నిజం లేదని బీఎస్పీ ఖండిస్తుంది.. 'ఇప్పటివరకైతే కాంగ్రెస్ తో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీకి సిద్ధమని' మధ్యప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు నర్మదా ప్రసాద్‌ అహివార్‌ స్పష్టం చేసారు.. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతానికైతే కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పొత్తులేదని తెలుస్తుంది.. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.