కాంగ్రెస్ పార్టీకి చెలగాటం బీజేపీకి రాజకీయ సంకటం

 

కాంగ్రెస్ పార్టీ చెలగాటం బీజేపీకి సంకటం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు ఉంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి. రెండు రోజుల క్రితం ఆర్ధిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో బీహార్ వెనకబాటుతనం గురించి ప్రస్తావిస్తూ, ఆ రాష్ట్రం కోసం తన బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసానని ప్రకటించారు. అయితే, అది కాకతాళీయంగా చేసిన ప్రకటన మాత్రం కాదు. దేశంలో వివిధ రాష్ట్రాల పరిస్థితి బీహార్ రాష్ట్రానికి తీసిపోకుండా ఉన్నపటికీ, ఆయన బీహార్ రాష్ట్రం పైనే ఎందుకు ప్రత్యేక మక్కువ చూపారంటే, మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది.

 

నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటిననాటి నుండి ఆ రాష్ట్రంలో గణనీయమయిన మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పధంలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడు రాజకీయాలు చేయనని చెప్పే నరేంద్ర మోడీనే ఆయన ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తున్నపటికీ, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అయన (జనత దళ్ పార్టీ) మోడీని ప్రధాని అభ్యర్ధిగా చేయాలనే బీజేపీ నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఒకవేళ మోడీయే ఎన్డీయేకు నాయకత్వం వహించేట్లయితే తానూ తప్పుకొంటానని కూడా స్పష్టం చేసారు.

 

బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలంటే, ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామి అయిన జనతా దళ్, దాని అధినేత నితీష్ కుమార్ మద్దతు తప్పనిసరి. అయితే, ఇంతవరకు నితీష్ కుమార్ ను ఏదోరకంగా ఒప్పించవచ్చునని భావిస్తున్న బీజేపీకి చిదంబరం విసిరిన పాచికతో బిత్తరపోయింది.

 

మోడీని వ్యతిరేఖిస్తున్న నితీష్ కుమార్ ను ఎన్డీయే నుండి తమ వైపు ఆకర్షించగలిగితే, ఎన్డీయే బలం తగ్గించడమే కాకుండా, తద్వారా రాబోయే ఎన్నికలలో బీజేపీ అవకాశాలను కూడా దెబ్బతీయగలుగుతుంది. ఇప్పటికే, బీజేపీలో, ఎన్డీయేలో మోడిని వ్యతిరేఖించేవారు చాల మందే ఉన్నారు, బీజేపీ గనుక మోడిని తమ ప్రదాని అభ్యర్ధిగా ఎంచుకొంటే, మొదటగా నితీష్ కుమార్ బయటకి వచ్చేయడం ఖాయం. అది పార్టీలో, ఎన్డీయేలో విబేధాలకు దారి తీసి చివరికి ఎన్డీయే విచ్చినం అవుతుందని కాంగ్రెస్ ఆశపడుతోంది.

 

ఒకవేళ నరేంద్ర మోడీని కాదని మరెవరినయినా ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి అది సంతోషం కలిగించే విషయమే అవుతుంది. బీజేపీని ఎన్నికలలో గెలిపించగల సమర్దుడయిన మోడీ తప్ప మరెవరినయినా కాంగ్రెస్ పార్టీ తన యువనాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో అవలీలగా ఓడించగలదని నమ్మకంతో ఉంది. అందువల్ల బీజేపీకి ఇప్పుడు మోడీ కావాలో లేక నితీష్ కావాలో తెల్చుకోమ్మనట్లు సవాలు విసిరింది.

 

మోడీని కాదనుకొని నితీష్ కుమార్ ను కాపాడుకొంటే, బలహీనమయిన బీజేపీకి కాంగ్రేస్ చేతిలో ఓటమి ఖాయం. నితీష్ కుమార్ ను వదులుకొని మోడీతో ముందుకు సాగితే, పార్టీలో, ఎన్డీయేలో లుకలుకలు తప్పవు, బీజేపీకి అధికారంలో రావడానికి ఎన్డీయేలో తగిన మద్దతు సరిపోదు. ఈ ఆలోచనతో కాంగ్రెస్ చిదంబర పాచిక విసిరింది. అది ఫలిస్తుందో లేదో రానున్న కాలమే చెప్పాలి.

 

అయితే, నిన్న డిల్లీలోజరిగిన బీజేపీ సమావేశంలో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడటం చూసినట్లయితే, బీజేపీ నితీష్ కుమార్ ను వాదులు కొని మోడీకే పట్టం కట్టాలని నిర్నయించుకొన్నట్లు కనిపిస్తోంది.