క్రీస్తు జీవితం నేర్పే పాఠాలు

రెండువేల సంవత్సరాల క్రితం జీసస్‌ అనే వ్యక్తి ఈ భూమ్మీద సంచరించాడు అనడంలో ఎవ్వరికీ ఏ సందేహమూ లేదు. ఆయనను దైవకుమారునిగా భావించినా భావించకున్నా, తన వ్యక్తిత్వంతో ఈ పుడమి మీద ఓ స్పష్టమైన ముద్రని వేశారనడంలో ఎలాంటి అనుమానమూ అక్కర్లేదు. అందుకే జీసస్‌ బోధలనే కాదు, ఆయన జీవితాన్ని గమనించినా కూడా అనేక పాఠాలు కనిపిస్తాయి. కాలం మారినా వాటిలోని విలువలు మనల్ని తీర్చిదిద్దుతాయి.

 

కరుణ
జీసస్‌ అంటే మన దృష్టిలో కరుణామయుడే! తన చెంతకు వచ్చినవారు ఎలాంటివారైనా, వారిని తనవారిగా భావించాడు. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచాడు. బాధలో ఉన్నవారిని ఓదార్చాడు. మంచి కోరిన వారికి నీతిని బోధించాడు. పొరుగువారిని ప్రేమించమంటూ... ఈ ప్రపంచాన్నే కరుణతో ముంచెత్తేందుకు ప్రయత్నించాడు. ఆఖరికి తనని శిక్షించినవారిని కూడా క్షమించమంటూ భగవంతుని వేడుకున్నాడు.

 

స్పష్టమైన జీవితం
ఈ ప్రపంచం గురించి జీసస్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని వెల్లడించేందుకు ఆయన ఎన్నడూ జంకలేదు. తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని పలువురు హెచ్చరించినా, తను చెప్పదల్చుకున్న విషయాన్ని కరాఖండిగా చెబుతూనే ముందుకు సాగారు. సాతాను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా కూడా, తాను సత్యం అనుకున్నదానినే ఆచరించేందుకు నిశ్చయించుకున్నారు. పేదవారి కోసం, బలహీనుర కోసం అధికారులతో పోరాడేందుకు సైతం సిద్ధపడ్డారు. ఆఖరికి తనని బంధించేందుకు అధికారులు కాపు కాశారని తెలిసినా కూడా నిర్భయంగా గెత్సెమనే తోటకు వెళ్లారు.

వినయం
ఏసు మాటలు కఠినమైన సత్యాలతో నిండి ఉండేవి. కానీ పరుషపదజాలాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ వాడలేదు. రాజు ముందైనా, పేదవాడి ముందైనా ఆయన తీరు ఒకలాగే సాగింది. తనని విశ్వసించేవారు ఎంతమందున్నా, తాను భగవంతుని కుమారుడిని అనే చెప్పుకున్నారు కానీ సాక్షాత్తూ దైవాన్ని అని చెప్పుకోలేదు. పొగడ్తలకు, ఆడంబరాలకు అతీతంగా ఆయన జీవితం సాగింది. ఆఖరు క్షణంలో సైతం జీసస్‌ ఒక్క మాట తూలలేదు.

విశ్వాసం – ప్రార్థన
జీసస్‌ ఒంటరిగా ధ్యానించుకునేందుకు, భగవంతుని ప్రార్థించుకునేందుకు ఇష్టపడేవారు. రోజుల తరబడి భగవత్ ధ్యానంలో గడిపిన ఘట్టాలూ జీసస్‌ జీవితంలో కనిపిస్తాయి. ఆయన ఆఖరు రాత్రి సైతం ప్రార్థనలోనే గడిచింది. ఆత్మపరిశీలన చేసుకోవడం, భగవంతుని పట్ల అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటం, ప్రార్థించడం... అనే మూడు అంశాలకీ జీసస్ గొప్ప ప్రాధాన్యతను ఇచ్చినట్లు కనిపిస్తుంది.

సహనం
జీసస్‌ జీవితం యావత్తూ ఓరిమిలోనే గడిచింది. తన చుట్టూ ఉన్న శిష్యులు సైతం ఎన్ని అనుమానాలను ప్రకటించినా, వారి సందేహాలన్నింటికీ ఓర్పుతో జవాబులందించేవారు. గిట్టనివారు ఎంతగా తూలనాడినా అదే ఓరిమితో భరించారు. చివరికి శిలువ మీదకు చేరాల్సి వచ్చినా శారీరికంగా, మానసికంగా... తనకి వచ్చిన కష్టాన్ని సహించారు.
ఇలా విశ్లేషిస్తూ పోతే జీసస్‌ జీవితంలో మనకి తారసపడే విలువలెన్నో! అందుకనే వేల సంవత్సరాలు గడిచినా కూడా క్రీస్తు అన్న మాట వింటే చాలు విశ్వాసులు పరవశించిపోతారు. భక్తుల మనసు అప్రయత్నంగానే ఆయన పట్ల లగ్నమవుతుంది. అలాంటి స్మరణకి ఈ క్రిస్మస్‌ను మించిన సదవకాశం మరేముంటుంది.

 

- నిర్జర.