పాలసముద్రంలో బెల్ కి శంకుస్థాపన

 

రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన జిల్లా అనంతపురం. ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని పరిస్థితిలో మారలేదు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమాని ఇప్పుడు ఆ జిల్లాలో చాల వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. జిల్లాలో గోరంట్ల మండలంలో పాలసముద్రం వద్ద భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అనే జాతీయ సంస్థ ఏర్పాటు కాబోతోంది. దానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శంఖుస్థాపన చేసారు.

 

చాలా భారీ వ్యయంతో నిర్మించబోతున్న బెల్ సంస్థలో రక్షణ రంగానికి చెందిన భారీ యంత్రాలు, రాడార్లు మొదలుకొని చిన్నచిన్న యంత్ర పరికారాలు వరకు తయారవుతాయి. ఈ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే దాని అనుబంధ పరిశ్రమలు చిన్నవి, పెద్దవి వందల సంఖ్యలో ఏర్పాటు అవుతాయి. వాటి వలన ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. కరువు పీడిత అనంతపురం జిల్లాలో వ్యవసాయాన్ని నమ్ముకోవడం కంటే పరిశ్రమలను నమ్ముకోవడమే మంచిది. కనుకనే అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చాలా శ్రద్ద, ఆసక్తి చూపిస్తున్నాయి. కనుక మున్ముందు జిల్లాకి మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి.