అంత ఎటకారం వద్దు!

 

 

 

తెలంగాణ రాజకీయ నాయకులకు సీమాంధ్ర ప్రజలంటే మరీ చులకనగా వున్నట్టుంది. అందుకే సీమాంధ్రులతో ఎటకారాలు పోతున్నారు. ఆ ఎటకారాలు కూడా అట్టాంటిట్టాంటి ఎటకారాలు కావు.. కడుపులో మండిపోయే ఎటకారాలు! అసలే అన్యాయంగా, ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేసేస్తున్నారని రగిలిపోతున్న సీమాంధ్రుల మీద తెలంగాణ నాయకులు తమ మాటల పెట్రోలు పోస్తూ మరింతగా రగిలిపోయేలా చేస్తున్నారు.

 

నాలుకలు కోస్తాం, తరిమికొడతాం అంటూ బెదిరించే వెటకారాలు కొన్ని అయితే, శాంతియుతంగా మాట్లాడినట్టు కనిపించే సుతిమెత్తని ఎటకారాలు కొన్ని! ఇప్పుడు సీమాంధ్రులు హైదరాబాద్‌లో అడ్డంగా ఇరుక్కుపోయారు కాబట్టి మనమేం మాట్లాడినా చచ్చినట్టు ఊరుకుంటారన్న నిర్లక్ష్యం తెలంగాణ రాజకీయ నాయకులలో కనిపిస్తోంది.



కేంద్రమంత్రి బలరాం నాయక్ తాజాగా చేసిన కామెంట్లు ఈ కోవకు చెందినవే. ఇంతకీ ఘనత వహించిన బలరాం నాయక్ గారు ఏమన్నారంటే, ప్రస్తుతానికి సీమాంధ్రులు తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఒప్పేసుకోవాలట. తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను ఎంతమాత్రం వ్యతిరేకించకుండా రాష్ట్ర విభజనకు సహకరించాలట.  తెలంగాణ వచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత అవసరమనుకుంటే సీమాంధ్ర, తెలంగాణ మళ్ళీ కలసిపోవాలట. ఇలాంటి పనికిమాలిన ప్రపోజల్ పెట్టడానికి బలరాం నాయక్ గారికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదు. తెలంగాణ నాయకులకు తమ తెలివితేటలు ప్రదర్శించడానికి, ఏ మాట పడితే ఆ మాట అనడానికి సీమాంధ్రులు తేరగా దొరికినట్టున్నారు. సీమాంధ్రుల దగ్గర మరీ అంత ఎటకారాలొద్దు మినిస్టర్ గారూ!