మళ్ళీ బాలయ్య గోల?

 

నటసింహం మరోసారి జూలు విదిల్చింది. నందమూరి వారసుల బాటలోనే బాలకృష్ణ పయనిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కోసం బాలయ్య పోరాడాల్సిన పని ఉందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ మాదిరిగానే పార్టీ అంతర్గత విషయాన్ని రచ్చ చేశారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభిమానులు. యెన్బీకే ఫ్యాన్స్ పేరుతో వివిధ జిల్లాల్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు నిర్వహించిన సమావేశాలు సంచలనం సృష్టించాయి. కంటి చూపుతో చంపేస్తానని సినిమాలో విలన్లను బెదిరించే బాలయ్య బాబు.. కనుసన్నల్లోనే అభిమానులు ఆందోళనకు దిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అభిమానులు డిమాండ్ చేయడం తెలుగుదేశం శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది.

 

గతంలోనూ చాలా సార్లు అలక పాన్పు ఎక్కిన బాలకృష్ణ ... మళ్ళీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్లు పార్టీకి హ్యాండ్ ఇచ్చే సమయంలో బాలయ్య ఒక్కడు బాబుతోపాటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. బాబు బాలయ్యకు బావ మాత్రమే కాదు.. వియ్యంకుడు కూడా..పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా ఎప్పుడూ బాలయ్య మాట్లాడింది లేదు. అలాంటిది పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో బాలయ్య అభిమానుల ఆందోళన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పార్టీలో కీలక పాత్ర పోషించాలనుకుంటే బాబుతో మాట్లాడవచ్చు.. తన అల్లుడైన లోకేష్ తో మాట్లాడి ఉండవచ్చు.. ఇవేమీ చేయకుండా అభిమానులతో ఆందోళన ఎందుకు చేయించారనే దాని చుట్టే టీడీపీ నేతల ఆలోచనలు సాగుతున్నాయి.

 

బాబు దగ్గర మాట చెల్లుబడి కాని నేతలు కొందరు బాలయ్య పంచన చేరి..తెర వెనుక ఉంది డ్రామాలు ఆడిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా నందమూరి నాయకుడి అసమ్మతి రాగం బాలయ్య..బాలయ్యా గుండెల్లో గోలయ్య అంటూ టీడీపీ నేతల గుండెల్లో మార్మోగుతోంది. తెగే దాకా లాగే బాబు గారు ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతారో అనే ఆశక్తితో చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఓ పక్క టీడీపీలోకి భారీగా ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తూ .. పసుపుపచ్చ కండువాలు కప్పేస్తున్నారు బాబు. మరో పక్క తెలంగాణాలో సైకిల్ పార్టులు ఒక్కొక్కటిగా "కారు"లో తరలించుకుపొతున్నారు.

 

రాష్ట విభజన నేపధ్యంలో సామాజిక తెలంగాణా, అవశేష ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం తనతోనే సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త రాష్ట్రం, రాజధాని పునర్ నిర్మాణం సాధ్యమని సీమాంద్ర జనాలు కూడా ఆశతో ఉన్నారు. ఇదే సెంటిమెంట్ తనకు కలిసొస్తుందని బాబు అందుకు తగిన వ్యూహాలు రచించుకుంటున్నారు. తెలంగాణలో నేతలు జారిపోతున్నా, కేడర్ ను కాపాడుకుని పార్టీని నిలబెట్టాలని విశ్వప్రయత్నం చెస్తున్నారు.

 

ఇంత కీలక సమయంలో బాలయ్య గొడవ బాబుకి చికాకు పెట్టె అంశమే. తెలుగుదేశంలో ఎన్టీయార్ కుటుంబం ప్రతినిధిగా ఉన్న బాలయ్య మనసెరిగి మసులుకుంటే అన్నగారి అభిమానుల అభిమానం చూరగొనొచ్చు .. అదే సర్దుకుంటుంది అని వదిలేస్తే.. ప్రత్యర్హి పార్టీలకు బాలయ్యకు అన్యాయం అనే మరో విమర్సనాస్త్రాన్ని అందించినట్టవుతుంది. మరి బాబుగారు ఏమి చేస్తారో?