ఆర్టీసీ విభజనకు మరో చిన్న ఆటంకం

 

ఇంతవరకు ఉమ్మడిగా సాగుతున్న ఏపీయస్ ఆర్టీసీని ఈనెల 28నుండి ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహించుకోవాలని అంగీకరించాయి. అందుకోసం హైదరాబాద్ లో గల బస్ భవన్ లోనే వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు, అధికారుల కేటాయింపు కూడా పూర్తయింది. ఇక ఈనెల 25న ఏపీయస్ ఆర్టీసీ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి దానికి ఆమోదముద్ర వేయడం లాంచన ప్రాయమేనని అందరూ భావిస్తున్న తరుణంలో సాంకేతిక కారణం వలన ఆ సమావేశం రద్దు చేయబడింది. పాలక మండలిలో రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన తగినంత ప్రాతినిధ్యం కలిగి ఉండాలనే విభజన చట్టంలో ఉన్న షరతు వలన సమావేశం కంటే ముందు రెండు రాష్ట్రాల సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడిన ఉత్తర్వులను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేయవలసి ఉంటుంది. కనుక పాలకమండలిని ఏర్పాటుచేసే వరకు సామవేశాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు వ్రాయడంతో ఈనెల 25న జరగవలసిన సమావేశం రద్దు అయింది. ఆర్టీసీకి పాలకమండలిని ఏర్పాటుచేసి, సమావేశం నిర్వహించి ఆర్టీసీ విభజనకు ఆమోదం తెలిపే వరకు యాధావిదిగా ఆర్టీసీ ఉమ్మడిగానే కొనసాగుతుంది.