రెండు రాష్ట్రాల మధ్య చదువుల రగడ
posted on Aug 4, 2015 11:53AM
రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉద్యోగుల రిలీవింగ్ పై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అది ఒక కొలిక్కి రాలేదు.. ఇప్పుడు మళ్లీ రెండు రాష్ట్రాల మధ్యం చదువుల వివాదం మరింత పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధి వరకే అడ్మిషన్లు జారీ చేసేందుకు నోటీఫికేషన్ తయారుచేయనుంది. అయితే ఈ విషయంలో గతంలో గవర్నర్ జోక్యం చేసుకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా ఏపీ విధ్యార్దులకు అడ్మిషన్లను నిలిపివేసింది. దీంతో పదో షెడ్యూల్ పరిధిలోని యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులకు ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోయాయి. తెలంగాణ యూనివర్సిటీ అయితే ఏకంగా ఒక మెట్టక్కి ఆ యూనివర్శిటీలో పని చేసే ఏపీ ఉద్యోగులకు ఈ నెల నుండి జీతాలు కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపింది.
అసలు ఏటా ఏపీకీ చెందిన అనేక మంది విద్యార్ధులు యూనివర్శిటీల నుండి లక్షల సంఖ్యలో చదువుకుంటారు. ఓపెన్ వర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు ప్రధానమైన కోర్సులను అందిస్తుండడంతో అనేక మంది వస్తుంటారు. ఒక్క అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో వివిధ కోర్సుల్లో 70వేల మంది ఏపీ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు తాము కూడా కేవలం తెలంగాణ వరకే అడ్మిషన్లు ఇస్తున్నామని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ తెలంగాణ ముఖ్యకార్యదర్శిని కలిసి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.
మరోవైపు ఇదే విషయంపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై మండిపడింది. ఏ చట్టాన్ని అనుసరించి ఏపీ విద్యార్ధులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయు) అందిస్తున్న సేవలను నిలిపి వేశారని ప్రశ్నించింది. అలా నిలిపివేయాలని ఏ చట్టంలో ఉందో చూపాలని మండిపడింది. ఒక రాష్ట్రంలో ఉన్న యూనివర్శిటిలో ఆ రాష్ట్ర విద్యార్ధులే చదవాలని లేదు.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో విద్యార్ధులు చదువుకునే అవకాశం ఉందని.. అందులోనూ అదీ ఓపెన్ వర్సిటీలో ఇలాంటి ఆంక్షలేంటి? అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం వర్సిటీ తరపు న్యాయవాదిని నిలదీసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు వర్సిటీ రిజిస్ర్టార్‌ను కోర్టుకు హాజరవ్వాలని ఆదేశిస్తామని హెచ్చరించింది.