ఏపీకి 22 వేలమంది ఉద్యోగులు తరలింపు
posted on Aug 12, 2015 6:09PM
ఇప్పటికే ఏపీ రాజధానిలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలను.. ఉద్యోగులను ఏపీలోకి బదలాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారు. అమరావతికి సమీపంలో.. గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఉద్యోగులను తరలించే విషయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కెఎస్ జవహర్ కమిటీ కూడా దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ శాఖలను విజయవాడ, గుంటూరులకు తరలించే నేపథ్యలో జరిపిన విచారణలో దాదాపు 22, 000 ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే రెండు నెలల్లో ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కు అందజేసింది. దీనిలో భాగంగా ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐవైఆర్ కృష్ణారావు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అయి అభిప్రాయాలను సేకరించనున్నట్టు సమాచారం.
అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి రావాలంటే అందుకు తగిన కార్యలయాలు కాని, వసతి సౌకర్యాలు కాని సరిగా లేవు. ఏయే శాఖల నుంచి ఎంతమంది ఉద్యోగులు వెళ్లాలి? ఆయా శాఖలు, విభాగాల కార్యాలయాలకు ఎన్ని చదరపు అడుగుల స్థలం కావాలి అనే విషయంపై అధ్యయనం చేసి.. ఇంతమంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చి ఉండటానికి మొత్తం 30 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలని కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కెఎస్ జవహర్ కమిటీ విజయవాడ, గుంటూరు నగర పరిసర ప్రాంతాలను పరిశీలించింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని మేధా టవర్స్, లైలా టవర్స్ కూడా పరిశీలించి అక్కడ కూడా ప్రభుత్వ కార్యలయాలు ఏర్పాటు చేయలనుకుంటున్నట్టు తెలుస్తోంది.