ఏరికోరి తెచ్చుకున్న సాక్షి ఉద్యోగిపై జగన్ ఫైర్!!

 

వైఎస్ జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు దాటింది. అయితే ఈ మూడు నెలల్లోనే.. మూడేళ్లలో ఎదుర్కోవాల్సిన ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. మొదట్లో టీడీపీ జగన్ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇస్తామని చెప్పింది. అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తన నిర్ణయాన్ని మార్చుకొని జగన్ సర్కార్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టింది. టీడీపీ బాటలోనే మిగతా పార్టీలు కూడా నడుస్తున్నాయి. ప్రతి చిన్న విషయాన్నీ, జగన్ చేసే ప్రతి తప్పటడుగుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇలా చాలా తక్కువ సమయంలోనే జగన్ సర్కార్ బోలెడంత నెగటివ్ పబ్లిసిటీ మూటగట్టుకుంది. దీంతో జగన్ కి చిర్రెత్తుకొచ్చిందట. ఇంకేముంది తాను ఏరికోరి తెచ్చుకున్న సాక్షి ఉద్యోగి మీద మండిపడ్డారట.

సీఎంకి చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరిని నియమించారు. శ్రీహరి సాక్షిలో పనిచేశారు. అంతేకాదు 14 నెలలు పాటు సాగిన జగన్‌ పాదయాత్రలో తొలిరోజు నుంచి చివరి రోజువరకూ కొనసాగారు. నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచార సేకరణ, అధ్యయనం, మీడియా వ్యవహారాల బాధ్యతలను నిర్వర్తించారు. జగన్‌ రాజకీయ ప్రస్థానం, పాదయాత్రలను ప్రధాన అంశాలుగా చేసుకుని సమగ్ర వివరాలతో 'అడుగడుగునా అంతరంగం' అనే పుస్తకం కూడా రాశారు. దీంతో జగన్ సీఎం అయ్యాక ఏరికోరి శ్రీహరిని సీపీఆర్వోగా నియమించుకున్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు తగిన ప్రచారాన్ని కల్పించడంలో ఆయన విఫలమయ్యారని అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. విపక్షాలు ప్రభుత్వం మీద తీవ్రమైన నెగిటివ్ ప్రచారం సాగిస్తున్నాయి. అయితే పాజిటివ్ అంశాల గురించి ప్రభుత్వంలోని సంబంధిత వర్గాలు సరైన ప్రచారం కల్పించలేకపోతున్నాయని అంటున్నారు. మీడియాను కో ఆర్డినేట్ చేసుకోవడం, చేసిన మంచి పనులను ప్రజలకు చేరువయ్యేలా చేయడం సీపీఆర్వో బాధ్యత. అయితే ఈ విషయంలో సీపీఆర్వో శ్రీహరి పూర్తిగా విఫలం అయినట్టుగా తెలుస్తోంది.

ఈ విషయంపై జగన్ కూడా ఆగ్రహించినట్టుగా సమాచారం. 'నెగిటివ్ పబ్లిసిటీ ఎలా స్ప్రెడ్ అవుతోంది, మంచి పనులకు ఎందుకు ప్రచారం రావడం లేదు..' అంటూ జగన్ ఆ అధికారిని నిలదీసినట్టుగా తెలుస్తోంది. బెల్ట్ షాపుల రద్దు, భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ, ఇతర సంక్షేమ పథకాల గురించి ఎందుకు జనాల్లో పాజిటివ్ టాక్ రావడం లేదని, సీపీఆర్వో శ్రీహరి ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని సీఎం జగన్ గట్టిగా క్లాస్ పీకినట్టు సమాచారం.