లోకేష్ కోసం చంద్రబాబు తప్పుకుంటున్నారా?

 

చంద్రబాబు 1989 నుంచి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే కుప్పం నుంచి ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో కూడా బరిలోకి ఈజీగా గెలుస్తారు. అయితే ఈసారి చంద్రబాబు మాత్రం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివెనుక రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి లోకేష్ ని కుప్పం నుంచి బరిలోకి దింపడం. రెండోది ఉంగుటూరులో చంద్రబాబు పోటీ చేస్తే జిల్లా అంతటా ప్రభావితమై.. ఓ వైపు జిల్లాలో జనసేన దూకుడికి కళ్లెం వేయొచ్చు మరోవైపు వైసీపీని మానసికంగా దెబ్బతీయొచ్చని చంద్రబాబు భావిస్తున్నారట.

చంద్రబాబు ఈసారి కుప్పం నుంచి కాకుండా గుంటూరు జిల్లా లేదా పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. చివరకు చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సర్వేల్లో కూడా ఇక్కడి ఓటర్లు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని తేలింది. ఇక్కడ నుంచి స్వయంగా సీఎం చంద్రబాబే పోటీ చేస్తే రికార్డు మెజార్టీ రావడం ఖాయమని అక్కడి నాయకులు భావిస్తున్నారు. కుప్పం నుంచి లోకేష్‌ ను బరిలోకి దిగితే.. అక్కడ కుమారుడు సులువుగా గెలుపొందుతాడు. ఉంగుటూరులో తాను పోటీ చేస్తే ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ హవా వీస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట. మొత్తానికి చంద్రబాబు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. అటు కుమారుడికి రూట్ క్లియర్ చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారు. చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో.