చాప క్రింద నీరులా పేరుకుపోతున్న అవినీతి

 

రాజకీయనాయకులు, అధికారులు, అవినీతి ఈ మూడు కలిస్తే ఏర్పడేదే ప్రభుత్వం. ఈ నిర్వచనం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి కొంచెం ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే, అక్కడ ఎవరూ ఎవరికీ జవాబు దారీ కారు. ఇక విషయానికి వస్తే, కళంకిత మంత్రులను నిర్లజ్జగా, నిర్బీతిగా వెనకేసుకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి చాప క్రింద నీరులా ఎప్పుడూ ఉండనే ఉంటుంది.

 

అవినీతి నిరోధక, విజిలన్స్, పోలీసు వంటి వివిధ శాఖలు సమర్పించిన నివేదికలు దాదాపు 400పైనే పేరుకుపోయున్నాయి. రెవెన్యు, మునిసిపల్, ఆరోగ్యం, నీటిపారుదల వంటి అనేక ప్రభుత్వ శాఖలలో అవినీతి, లంచగొండి అధికారులను వలపన్ని పట్టుకొని, , వారిపై శాఖా పరంగా మరియు సివిల్, క్రిమినల్ కేసులు నమోదుచేసి వెంటనే తగిన చర్యలు తీసుకోమని కోరినప్పటికీ, నేటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. కారణం కొందరు కాంగ్రెస్ నేతలతో సదరు అధికారులకు ఉన్న సత్సంబందాలే. వారిపై దైర్యం చేసి చర్యలు తీసుకొన్నట్లయితే, పార్టీలో, ప్రభుత్వంలో కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. గనుక, ఏ నిర్ణయమూ తీసుకోకుపోవడమే ఒక నిర్ణయంగా మారింది.

 

దీనివల్ల ప్రభుత్వాధికారులకి మరింత దైర్యం కలిగితే, వారిని శ్రమ పది పట్టుకొన్న విజిలన్స్ మరియు అవినీతి శాఖల అధికారుల మనో దైర్యం నానాటికి సన్నగిల్లి నిర్లిప్తత ఏర్పడుతుంది.

 

కేవలం అవినీతి, లంచ గొండి అధికారులను పట్టుకోవడమే కాక, వివిధ శాఖలలో, ప్రభుత్వ పధకాల అమలులో అవినీతి బీజాలు పడుతున్నపుడే వాటిని కనిపెట్టి విజిలన్స్ శాఖ ప్రతీనెలా టంచనుగా హెచ్చరిక నివేదికలు కూడా పంపుతుంటుంది. అంటే అవినీతిని మొగ్గ దశలోనే త్రుంచేసే వ్యవస్థ కూడా మనకి ఉందన్న మాట. అయితే, కిరణ్ ప్రభుత్వం కనీసం ఈ హెచ్చరికలను సైతం ఖాతరు చేసే పరిస్థితిలో లేదని ఆయన వద్ద పేరుకుపోయిన 197 (2011); 176 (2012); 228 (2013) నివేదికలు తెలియజేస్తున్నాయి.

 

కిరణ్ కుమార్ రెడ్డి నవంబర్ 2010లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇంత వరకు విజిలన్స్ మరియు అవినీతి నిరోధక శాఖలు మొత్తం 395 నివేదికలు పంపి వెంటనే తగిన చర్యల కోసం సిఫార్స్ చేస్తే వాటిలో కనీసం ఒక్కటి ఇంతవరకు పరిష్కరించలేదు. వాటిలో 148 మంది ప్రభుత్వంలో అత్యున్నత పదవులలో ఉన్నవారిపై చర్యలకి సిఫార్సు చేయబడినవీ ఉన్నాయి. అయితే షరా మామూలుగానే ఆ నివేదికలన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో బూజులు పడుతున్నాయి.

 

ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో పనులు ఏవిధంగా జరుగుతాయో ఎవరయినా ఊహించవచ్చును. తాజా లెక్కల ప్రకారం గత 3 నుండి 12 సం.ల కాలంలో పంపబడిన 1987 నివేదికలతో కలిపి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మొత్తం 2,966 నివేదికలు పోగుబడి ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గిర పడినప్పుడు రైతుల రుణాలు, వడ్డీలు మాఫీ చేసినట్లు, సదరు ప్రభుత్వాధికారులను మంచి చేసుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ నివేదికలన్నీ బుట్ట దాఖలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

ఇక, అటువంటప్పుడు ప్రభుత్వ శాఖలలో అవినీతి గురించి ఎంత చర్చించుకొంటే మాత్రం ఏమి ప్రయోజనం?