బీజేపీ ఏపీలో తోక పార్టీగా మిగిలిపోతుందా..?

జాతీయ పార్టీల హవా ఉత్తరాదిలో నడిచినట్లు దక్షిణాదిలో నడవదు. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీల ముందు వాటి ఆటలు సాగవు. ఎంతపెద్ద కొమ్ములు తిరిగిన నేషనల్ పార్టీలైనా సరే... రీజనల్ లీడర్ల సాయం లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేరన్నది ఓపెన్ సీక్రెట్. ఒకప్పుడు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ హైకమాండ్ చేసిన పొరపాట్లతో చేతులారా తన ఘోరీని అదే కట్టుకుంది. ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే తప్ప జనం గుర్తించలేని పరిస్థితికి కాంగ్రెస్ చేరుకుంది. సరే.. అదిప్పుడు గడిచిన కథ.. వర్తమానంలోకి వస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో స్ట్రాంగ్‌గా ఎదగాలని కంకణం కట్టుకుంది.

 

కర్ణాటకలో అల్రెడీ ఒకసారి పవర్ రుచి చూసింది కాబట్టి.. అక్కడ అంతో ఇంతో బెటర్‌గానే ఉంది.. ఇక జయ మరణంతో తమిళ రాజకీయాల్లో వేలుపెట్టిన కమలం.. రజనీ సపోర్ట్‌తో కానీ.. అన్నాడీఎంకే అండతో కానీ నాలుగు సీట్లు వెనకెసుకునే ప్రయత్నాల్లో ఉంది.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో కేసీఆర్‌ ఎత్తుల ముందు కాషాయం నిలబడలేదు. ఎటోచ్చి ఆంధ్రప్రదేశ్‌లోనే పరువు కాపాడుకోవాలి.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టి రెండు ఎంపీ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

 

అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీని వదిలించుకునేందుకే బీజేపీ పెద్దలు రాజకీయాన్ని.. నడిపారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. మిత్రధర్మాన్ని పాటించకుండా... ఎక్కడ దొరికితే అక్కడ తెలుగుదేశాన్ని కార్నర్ చేసింది బీజేపీ. ముఖ్యంగా సోము వీర్రాజు వంటి నేతలైతే ఢిల్లీ అండదండలతో ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఓపికగా భరించిన టీడీపీకి తాజా బడ్జెట్‌తో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీనిలో భాగంగా తమ డిమాండ్లకు ఒప్పుకుంటే సరే.. లేదంటే ఎవరి దారులు వారు వెతుక్కోవడమే అన్న సంకేతాలు ఇచ్చారు టీడీపీ అధినేత.

 

తెలుగుదేశం పక్కకు తప్పుకున్నా.. జగన్ అండతో గట్టెక్కాలని కమలనాథులు భావిస్తున్నప్పటికీ.. అదంత తేలిక కాదు.. వైసీపీ అధినేత జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఏ మాట మీద నిలబడతాడో ఆయనకే కాదు.. పార్టీ శ్రేణులకే అర్ధం కాని అయోమయ పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే బీజేపీకి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే అన్న చందాన తయారవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని వదులుకుంటే.. కాంగ్రెస్, వామపక్షాల లాగా ఎవరో ఒకరు రాకపోతారా..? అన్నట్లు ఎదురుచూసే తోక పార్టీల లాగా బీజేపీ మారిపోతుందని విశ్లేషకుల అంచనా.