కేంద్రాన్ని నిలదీస్తున్నందునే ఐటీ దాడులు

 

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు తెదేపా నేతలు విమర్శలు కూడా చేశారు.నెల్లూరు చెందిన తెదేపా నేత బీరం మస్తాన్‌రావు నివాసంలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఆ తర్వాత విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్‌ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లోనూ తనిఖీలు జరిపినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.అయితే ఆ వార్తలను మంత్రితో పాటు ఐటీ అధికారులు సైతం ఖండించడంతో వివాదానికి తెరపడింది.తాజాగా తెదేపా రాజ్యసభ సభ్యుడి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.పోట్లదుర్తిలోని నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆయనకు చెందిన సంస్థల కార్యాలయాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో రమేశ్‌ సోదరుడు సీఎం సురేశ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు.అధికారులు ఆయన్ని బయటకు పంపి పలు ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు.మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్‌ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీ లో ఉన్నారు.కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌ ఢిల్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు, ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీకి ఆయన నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్‌ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.ఉక్కు కర్మాగారం ఏర్పాటు డిమాండ్‌తో‌ నేను దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్రం మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసి కర్మాగారం ఏర్పాటుపై నిలదీశాను.దీనికి ప్రతిఫలంగా మరుసటిరోజే నాపై ఐటీ దాడులు చేయించారు.కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే కేంద్రం ఐటీ దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోంది.సీఎం రమేశ్‌పై దాడులు జరుగుతాయని భాజపా, వైకాపా నేతలు కొద్దిరోజుల క్రితమే చెప్పారు. వైకాపా చెప్పినట్లే భాజపా నడుచుకుంటోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?వారి కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు. మాపై ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేది లేదు.కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తున్నందునే తనపై కక్షతో ఐటీ దాడులు జరిపిస్తున్నారని సీఎం రమేశ్‌ ఆరోపించారు.ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.