ఢిల్లీలో ఏపీపై నేడు కీలక భేటీ
posted on Nov 12, 2014 9:04AM
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు అందాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ, అపరిష్కృతంగా వున్న ఇతర అంశాలను చర్చించడానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం ఈ సమావేశం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రధాని మోడీని కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తాజా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, వ్యయ, రెవెన్యూ కార్యదర్శులు, వాణిజ్య కార్యదర్శులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలమీద చర్చ జరుగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు పన్నుల ప్రోత్సాహం, 24,350 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. అలాగే 2014 - 15 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు 24,811 కోట్లను ప్రత్యేక గ్రాంటుగా అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుతోంది. ఈ సమావేశంలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం వుంది.