వీళ్ల ట్వీట్లలో అసలు దోషి ఎవరో..?

గత కొద్దిరోజులుగా దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో అగ్గిని రాజేసిన అంశం విభజన హామీల అమలు. ఈ సెగ ఎప్పటి నుంచో మనసులో ఉన్నప్పటికీ.. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న సాకుతో.. ఏపీ విభజన చట్టంలో హామీల సాధన అంశం తెరపైకి వచ్చి.. ఆంధ్రలో మళ్లీ అలజడి రేపింది. దానికి ముందు నాలుగు రోజుల పాటు ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో చేసిన విన్యాసాలతో జనం ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. రాష్ట్రానికి చెందిన పార్టీల ఎంపీలు ఫ్లకార్డులు పట్టుకున్నప్పటికీ.. దానికి బీజం వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ సభ్యులే. వీరిని చూసే మిగిలిన వారు.. తాము వెనుకబడిపోతామని.. క్రెడిట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతుందని భయపడి ఆందోళన బాట పట్టారు.

 

రాజ్యసభ వేదికగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో.. తాము చేయగలిగింది చేశామని టీడీపీ సభ్యులు అనుకుంటున్నారు. వారి భావనలో తప్పు లేదు.. అంతకు మించి వారు చేయలేరు కూడా. ఏం జరిగినా.. జరగకున్నా.. తెలుగుదేశం ఎంపీల పట్ల రాష్ట్రంలో కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. లోక్‌సభలో పదిహేను నిమిషాల స్పీచ్‌తో.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. బెజవాడలో అడుగుపెట్టిన దగ్గర నుంచి గుంటూరు వరకు జయదేవ్‌కి జనం నీరాజనాలు పట్టారు. ఇలాంటి టైంలో టీడీపీ ఎంపీలు వారు చేస్తున్న పోరాటం.. ఆ పోరాటం వల్ల టీడీపీకి జరుగుతున్న నష్టం... తదితరాలపై చాలా ఘాటుగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. టీడీపీ నేత – చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషధారణలో పార్లమెంటు ఆవరణలో.. తనదైన శైలిలో విచిత్ర నిరసన వ్యక్తం చేస్తుండగా – ఆయనకు మద్దతుగా పార్టీ ఎంపీలు మురళీమోహన్ – గల్లా జయదేవ్ – రామ్మోహన్ నాయుడులు నిలిచి ఉన్న ఫొటోను తన పోస్ట్ లో పెట్టిన వర్మ… చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు. "ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ విలువైన ఓటుతో ఇలాంటి జోకర్ల లాంటి ఎంపీలనా ఎన్నుకుంది.. ఇలాంటి జోకర్లను చూసి మోడీ కూడా ఏపీని ఓ జోక్‌గానే తీసుకుంటున్నారు. కనీసం వీరు జోకర్లుగా కూడా పనికి రారు. జోకర్లకు తక్కువ.. ఇంకా దేనికో ఎక్కువ" అంటూ ఏకీ పారేశారు.

 

ఇది జరిగిన కాసేపటికి వర్మ ట్వీట్‌కు రీ ట్వీట్ చేశారు కత్తి మహేశ్. ఆ ఫోటోలో విచిత్ర వేషధారణలో కనిపిస్తున్న చిత్తూరు ఎంపీని టార్గెట్ చేస్తూ.. "మన ఖర్మ కాలి… ఈయన చిత్తూరు ఎంపీ. ఈయన ఓ డాక్టర్. యాక్టర్ కూడానూ. పార్లమెంటులో బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించాల్సింది పోయి… సభ వెలుపల నాటకాలు – డ్రామాలు చేస్తున్నారు. సిగ్గు సిగ్గు" అంటూ కామెంట్ చేశారు.. ఇక ప్రత్యేకహోదా ఆంధ్రుల జన్మహక్కు అన్నంతగా ప్రచారం చేసి మధ్యలో ఆగిపోయిన సినీనటుడు శివాజీ.. చాలా కాలం తర్వాత ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యాడు..

 

"రోడ్లకు లక్ష కోట్లు ఇచ్చామన్నారు. 67 వేల కోట్లకే లెక్క చెప్పారు. మిగితావి ఎవరికిచ్చారు ? మీరిచ్చిన దొంగ లెక్కలు, అంకెలు కూడితే 5 లక్షల కోట్లు . స్టీల్ ప్లాంట్ , దుగరాజపట్నం పోర్టు కలిపితే 12 లక్షల కోట్లు దాటతాయి. అసలు కేంద్ర బడ్జెట్ ఎంతో మీ మట్టి బుర్రలకి తెలుసా ? అబద్ధాలు అంకెల్లో చెబితే నిజాలైపోతాయా ? హరిబాబు ఎప్పుడైనా ఆంధ్ర సమస్యలపై 10 నిమిషాలు పార్లమెంటులో మాట్లాడారా ? 27 పేజీల లేఖలో రైల్వే జోన్ మర్చిపోయావేం ? విశాఖ హరిబాబూ ?" అంటూ బీజేపీని దోషిగా తేల్చేశాడు. వర్మ, కత్తి మహేశ్‌‌లు టీడీపీ ఎంపీలను టార్గెట్ చేయగా.. శివాజీ మాత్రం తప్పు హరిబాబుదే అన్నట్లుగా ట్వీట్ చేశారు. అంత కన్‌ఫ్యూజన్ ఎందుకు తప్పెవరిదో తేల్చేందుకు.. పవన్ జేఏసీ ఉండగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.