చిరంజీవ.. సుఖీభవ!

 

 

 

నేడు తెలుగుజాతి దేశం ముందు తలెత్తుకుని నిలబడిన రోజు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో ఆంధ్రులు విశాలాంధ్రులై దేశంలోని ఇతర రాష్ట్రాల స్థాయిలో అభివృద్ధి వైపు దూసుకుపోయే అవకాశం కలిగినరోజు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి సరైన రీతిలో నివాళి అర్పించిన రోజు. ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజును ‘ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం’గా జరుపుకోవడం తెలుగువారికి గర్వకారణం.

 

తెలుగు వెలుగులను దేశమంతటా ప్రసరింపజేసిన ఈరోజు తెలుగువారికి పర్వదినం. తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది అని నినదిస్తూ అన్నదమ్ముల్లా కలసిమెలసి జీవిస్తున్న తెలుగుజాతిని ఈమధ్యకాలంలో కొన్ని అరిష్టాలు చుట్టుముట్టాయి. పచ్చగ పెరిగే తెలుగు జాతిని ముక్కలు చేయడానికి వేర్పాటు శక్తులు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. వేర్పాటు వాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని ప్రయత్నాలు చేయడం మాత్రమే కాకుండా, తెలుగుజాతి ఎంతో గౌరవించే స్ఫూర్తి ‘తెలుగుతల్లి’ని, తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును కూడా విమర్శించే స్థాయికి దిగజారారు.




తెలుగు జాతి మొత్తం ఎంతో గర్వకారణంగా భావిస్తూ జరుపుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాన్ని కూడా అవమానిస్తున్నారు. పదవుల కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం ‘తెలంగాణవాదులు’ అనే ముసుగు వేసుకున్న కొందరు స్వార్థపరులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా, బ్లాక్ డేగా ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలను జరుపుకోవాలంటే ప్రజలు భయపడేలా చేసే రాజకీయ రౌడీలూ బయల్దేరారు. గత కొంతకాలంగా ఎవరెన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్ అవతరోణత్సవాలు రాష్ట్రమంతటా జరుగుతూనే వున్నాయి. భవిష్యత్తులో జరుగుతూనే వుంటాయి. ఎంతో బలమైన తెలుగుజాతిని వేరుచేయడం తెలుగుజాతిలోనే వున్న ద్రోహుల వల్ల కాదు.. ఇతర రాష్ట్రాలవారి వల్ల కాదు.. విదేశీయుల వల్ల కూడా అయ్యేపని కాదు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన అందాల ఆంధ్రప్రదేశ్‌ని చిరంజీవి... సుఖీభవ అని దీవిద్దాం.