నేడు శ్రీ సిటీలో 11 పరిశ్రమలకు శంఖుస్థాపన

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో శ్రీసిటీలో ఏకంగా 11 దేశ, విదేశీ పరిశ్రమలకు శంఖుస్థాపన, మరో 9 పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. రూ. 1600 కోట్ల వ్యయంతో శ్రీసిటీలో నిర్మించిన పెప్సీ కంపెనీ, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేస్తారు. శ్రీసిటీలో నిర్మించబడిన కోల్గేట్ టూత్ బ్రష్షుల తయారీ కర్మాగారానికి కూడా ఆయన ఈరోజు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కర్మాగారంలో ఏడాదికి 220 మిలియన్ల టూత్ బ్రష్షులు ఉత్పత్తి అవుతాయి.

 

ఈ రోజు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేయబోయే సంస్థలలో నాలుగయిదు సంస్థలు తప్ప మిగిలినవన్నీ విదేశీ సంస్థలే. దాదాపు రూ.1450 కోట్లు పెట్టుబడులతో ఈ సంస్థలు ఏర్పాటు చేయబడుతున్నాయి. త్వరలోనే జపాన్ దేశానికి చెందిన ఇసుజు ట్రక్కుల తయారీ సంస్థ కూడా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేప్పట్టబోతోంది.

 

ఇంతవరకు శ్రీసిటీలో దాదాపు రూ.20వేల కోట్లు పెట్టుబడులతో దేశవిదేశాలకు చెందిన 105 పరిశ్రమలు ఏర్పాటు చేయగా వాటిలో 68 పరిశ్రమలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఉత్పత్తి ఆరంభించాయి. ఈరోజు మరికొన్ని సంస్థలు ఉత్పత్తిని ఆరంభించబోతున్నాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 22 వేలమంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థల ద్వారా మరో 2, 000 మందికి ఉపాధి లభిస్తుంది. శ్రీసిటీలో స్థాపించబడుతున్న పరిశ్రమలలో స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగాలు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.