పవన్ కళ్యాణ్ కి తెదేపా అలా జవాబు చెప్పింది
posted on Jul 18, 2015 3:27PM
(3)(4).jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసేందుకు ఉన్న అవరోధాలన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగించుకొంటూ వస్తున్నామని, దీనికి సంబందించిన పనులు దాదాపు 60 శాతం వరకు పూర్తయ్యాయని మరొకటి రెండు నెలల్లో అన్ని అవరోధాలు తొలగిపోయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందని కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. అదే విధంగా రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేసే విషయంలో కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా ఆలస్యం జరుగుతోందని కానీ వచ్చే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్రమంత్రి వర్గం సమావేశమయ్యి రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. తామందరం వీటితో సహా ఇంకా అనేక ఇతర హామీల అమలు కోసం కేంద్రం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. సెక్షన్: 8 అమలు కోసం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా షెడ్యుల్: 10 క్రిందకు వచ్చే సంస్థలను తెలంగాణా ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడంపై కేంద్రానికి పిర్యాదు చేసి తమకు న్యాయం చేయవలసిందిగా కోరినట్లు తెలిపారు. ఈ అంశాలపై తాము పూర్తి శ్రద్ధ పెట్టడం లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను మిత్రపక్షం ఇస్తున్న సలహాగానే తాము స్వీకరిస్తున్నామని తెలిపారు. కానీ ప్రత్యేక హోదా అంశంపై పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు సుజనా చౌదరి ఈ విధంగా జవాబులు చెప్పినట్లు భావించవచ్చును.
తెదేపాకి మిత్రుడిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు విమర్శల వలన తెదేపా ఎంపీలపై, కేంద్ర మంత్రులపై ప్రజలలో వ్యతిరేకభావం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. బహుశః అందుకే ఆయన ఈవిధంగా సవివరంగా సమాధానం చెప్పి ఉండవచ్చును. పవన్ కళ్యాణ్ తమ మిత్రుడు కనుక ఆయనపై తాము ప్రతివిమర్శలు చేయమని చెపుతూనే, ఆయన ఆరోపించినట్లుగా తామేమీ చేతులు ముడుచుకొని కూర్చోలేదని ప్రయత్నలోపం లేకుండా తాము కృషి చేస్తూనే ఉన్నామని ధీటుగా జవాబు చెప్పినట్లయింది. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను పట్టుకొని తమపై చెలరేగిపోయిన కాంగ్రెస్, వైకాపాలకు దీనితోనే జవాబు చెప్పినట్లు భావించవచ్చును. కానీ ఈ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు ఈ మూడింటినీ తెదేపా సాధించినప్పుడే వారు భుజాలు చరుచుకోవచ్చును. లేకుంటే అప్పుడప్పుడు ప్రతిపక్షాలతో బాటు జనసేన వంటి మిత్ర పక్షాల నుండి కూడా ఇటువంటి విమర్శలు ఎదుర్కోక తప్పదు.