ఆంధ్ర, తెలంగాణల్లో బీజేపీ బలపడగలదా?
posted on Mar 31, 2015 1:51PM
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోరుకొంటున్నారు. అందుకోసం ముందుగా ఆంధ్రాకు చెందిన పార్టీ నేతలతో మోన్న డిల్లీలో సమావేశమయ్యి వారికి అవసరమయిన సూచనలు, సలహాలు ఇచ్చేరు. తెలంగాణా నేతలతో సమావేశమయ్యేందుకు ఆయన త్వరలోనే హైదరాబాద్ కి రాబోతున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి చాలా అవరోధాలున్నాయి. రెండు రాష్ట్రాలలో నేతలందరూ గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రస్తుతం తెరాస పార్టీ తెలంగాణాలో అధికారంలో ఉంది గనుక మిగిలిన పార్టీలకంటే చాలా బలంగా ఉంది. ఇంతవరకు తెలంగాణాకోసం పోరాడి విజయం సాధించిన తెరాస, ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించి ఆ దిశలో అడుగులు వేయడం మొదలుపెట్టింది. కనుక మిగిలిన ఈ నాలుగేళ్లలో తెలంగాణా రాష్ట్రాభివృద్ధి చేసి చూపించగలిగితే ప్రజలు దానివైపే మొగ్గు చూపవచ్చును లేకుంటే ఇతర రాజకీయ పార్టీలవైపు చూడవచ్చును.
ఒకవేళ అప్పటికి మోడీ ప్రభుత్వం దేశ ఆర్ధిక, పారిశ్రామిక వ్యవస్థలను గాడిన పెట్టగలిగితే, అది తెలంగాణాలో బీజేపీకి సానుకూలాంశంగా మారగలదు. అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికి తెదేపా, బీజేపీలు కలిసి పనిచేస్తాయా లేదా? అనే అంశం కూడా బీజేపీపై ప్రభావం చూపవచ్చును. తెలంగాణాలో బీజేపీకి ఉన్న మరో సౌకర్యం ఏమిటంటే అక్కడ అధికార తెరాసతో ఎటువంటి పొత్తులు లేకపోవడం. కనుక తెలంగాణా బీజేపీ నేతలు నిర్మొహమాటంగా అధికార తెరాస ప్రభుత్వాన్ని విమర్శించుతూ ప్రభుత్వంతో పోరాడవచ్చును. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లుగా మిగిలిన ఈ నాలుగేళ్ల సమయంలో తెలంగాణాలో బీజేపీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోగలిగినట్లయితే తెరాసను ఎదుర్కోగలదు.
ఇక ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి అంత గొప్పగాలేదని, తెదేపా, వైకాపాలు మాత్రమే చాలా బలంగా ఉన్నాయనే సంగతి బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తారు. పైగా బీజేపీ, తెదేపాలు మిత్రపక్షంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా సాగుతున్నాయి. కనుక ఒకరినొకరు విమర్శించుకోవడం కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే ముందుగా పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో మిత్రపక్షమయిన తెదేపాకు ఎటువంటి అభ్యంతరాలు, ఇబ్బందులు కలుగకుండా చూసుకొంటూ ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది.
బీజేపీ వ్యూహాన్ని నిశితంగా గమనించినట్లయితే ఆ పార్టీ అధిష్టానం ఒకపక్క జగన్మోహన్ రెడ్డిని మంచిచేసుకొంటూ మరోవైపు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా తను బలపడాలని భావిస్తున్నట్లుంది. కానీ రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ తన వంతు సహాయసహకారాలు అందించి తోడ్పడే బదులు, వైకాపాతో చేతులు కలిపి తెదేపాను ఎదుర్కోవాలనుకొంటే బీజేపీకి లాభం కలుగకపోగా ప్రజలలో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది. కానీ రాష్ట్రంలో తెదేపాతో కలిసి సాగినంత కాలం బీజేపీ ఎటువంటి గుర్తింపుకి నోచుకోదు. కనుక రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ తన ప్రయత్నాలు, వ్యూహాలు సిద్దం చేసుకోక తప్పదు. బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంటు దొరికిందేమో?