మళ్లీ భూసేకరణ.. వెలిసిన పవన్ ఫ్లెక్సీలు


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను భూసేకరణకు వ్యతిరేకమని.. రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కుంటే పోరాడతామని గతంలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం కూడా కాస్త వెనక్కి తగ్గి భూసేకరణను ఆపింది. అయితే ఇప్పుడు మళ్లీ భూసేకరణపై వివాదాలు తలెత్తుతున్నాయి. ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ భూసేకరణ గురించి మాట్లాడటం.. నవంబర్ మొదటి వారంలో భూసేకరణ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చాంశనీయమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తెరమీదకి వచ్చాయి.

ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండలాల రైతలు తమ భూములు ఇవ్వబోమంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తుళ్లూరు మండలంలో ఉన్న 300 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని ప్రకటించడంతో ఇప్పుడు తుళ్లూరు రైతులు కూడా వారికి జతకట్టనున్నారు. దీనిలో భాగంగానే అప్పుడే మంగళగిరి మండలం నవులూరు, ఎర్రబాలెం, కురగల్లు గ్రామాల రైతులు జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రాజధాని మండలాల్లో అలజడి రేగింది.

కాగా ఇప్పటికే రాజధాని భూముల నేపథ్యంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కి, పవన్ కళ్యాణ్ కు విభేధాలు తలెత్తాయన్న దానిలో సందేహం లేదు. మరోసారి ఈ వివాదం తెరపైకి రావడంతో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో.. ఈసారి ఎలాంటి విభేధాలు తలెత్తుతాయో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోయినసారి పవన్ కళ్యాణ్ మాట మేరకు ప్రభుత్వం భూసేకరణను నిలిపింది.. మరి ఈసారి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది.. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అసలు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.