అంబేద్కరిజమ్… అందరూ అంటారుగాని… ఆచరించేది ఎందరు?

 

అంబేద్కర్ … అంబేద్కరిజమ్… ఇప్పుడు ఈ పదాలు అందరి నోటా వినిపిస్తున్నాయి! ఇంతకీ వీటిలోని అసలు ఉద్దేశం ఇటు రాజకీయ నేతలకి, అటు ఉద్యమకారులకి, మరో వైపు మేధావులకి, ఇంకో వైపు విద్యార్థి నేతలకి… అందరికీ అసలు తెలుసా? ఖచ్చితంగా తెలిసిన వారు కొందరే! ఎవరికి వారు తమకు తోచింది చెప్పేస్తూ అదే అంబేద్కరిజమ్ అనేస్తున్నారు. తమ తమ వ్యక్తిగత భావాజాలాలు వదిలి పెట్టకుండానే అంబేద్కరిజాన్ని నెత్తిన పెట్టుకుని దాంట్లో తమ అభిప్రాయాలు కలిపేస్తున్నారు. తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అంతే తప్ప దళితుల కోసం రేయింబవళ్లు తపించిన అంబేద్కర్ అసలు సిద్ధాంతం ఏంటో ఎవరూ పట్టించుకోవటం లేదు!

 

అంబేద్కరిస్టులు అంతా మోసం చేస్తున్నారని అనలేం. వాళ్లలో చాలా మంది సిన్సియర్ గానే దళితుల కోసం కృషి చేస్తున్నారు. కాని, సమస్యంతా రాజకీయ నేతలు, పార్టీలు అంబేద్కరిజాన్ని తల కెత్తుకోటంతోనే వస్తోంది. ఎంఐఎం నుంచీ బీజేపి దాకా ఏ పార్టీ కూడా అంబేద్కరిజాన్ని వ్యతిరేకించటం లేదు. ఇక బీఎస్పీ లాంటి దళితుల కోసమే ఆవిర్భించిన పార్టీ అయితే పూర్తిగా అంబేద్కర్ వాదం మీదే అస్థిత్వం కొనసాగిస్తోంది. కాని, ఇక్కడ విచిత్రం ఏంటంటే… పరస్పర విరుద్ధమైన భావజాలాలు వుండే పార్టీలు కూడా దళితులు,అంబేద్కర్ అనగానే ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించేస్తున్నాయి. ఉదాహరణకి కమ్యూనిస్టులు, బీజేపీనే తీసుకుంటే… వీరిద్దరికీ రాజకీయాల్లో ఒక్క అంశంలో కూడా సారూప్యత వుండదు. కాని, అంబేద్కర్ అంటే మాత్రం ఇరు పార్టీలు సై అంటాయి!

 

గతంలో బీజేపికి అగ్రవర్ణాల పార్టీ అంటూ ముద్ర వుండేది. ఇప్పుడు ఒక బీసీని ప్రధాని చేసిన ఏకైక జాతీయ పార్టీగా కొత్త రూపు సంతరించుకుంటోంది. అదే క్రమంలో కమలదళం దళితుల్ని కూడా అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆరెస్సెస్ , బీజేపి రిజేర్వషన్లకు వ్యతిరేకం అంటూ ఇతర పార్టీలు అప్పుడప్పుడూ ప్రచారం చేసినా… మోదీ టీమ్ అంబేద్కర్ ద్వారా తాము దళితులకి, రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదని నిరూపించే పనిలో వుంది. అందుకే, అంబేద్కర్ 126వ జయంతిని కూడా నమో ప్రత్యేకంగా నాగపూర్ వెళ్లి జరుపుకున్నారు. అక్కడ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన దీక్షా స్థలంలో ప్రత్యేకంగా ఉపన్యాసం చేశారు!

 

ఒకవైపు బీజేపి అంబేద్కర్ ను తమ వాడని చెప్పే ప్రయత్నం చేస్తోంటే… కాంగ్రెస్, కమ్యూనిస్టులు గతంలోనే ఈ పని చేశారు! అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేయటంలో , ఆయన గురించి గొప్పగా స్పీచ్ లు ఇవ్వటంలోనూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇద్దరూ ఇద్దరే! కాని, అటు కాంగ్రెస్ పాలనలోగాని, ఇటు కమ్యూనిస్టుల పాలనలోగాని దళితులకి వారు ఆశించినంత మేలేం జరగలేదు. అందుకు క్రమంగా ఆ పార్టీలకు దళితులు దూరమవుతుండటమే నిదర్శనం. ఇలాంటి పరిస్థితే ప్రాంతీయ పార్టీలకు ఎదురవుతోంది. దాదాపుగా ఏ ప్రాంతీయ పార్టీ కూడా అంబేద్కర్ వాదానికి వ్యతిరేకం కాదు. కాని, అన్ని పార్టీలు పైపై మాటలు చెప్పటమే తప్ప దళితులకి నిజంగా మేలు చేసి అంబేద్కరిజాన్ని ఆచరించింది లేదు. అందుకే, దళితుల సంక్షేమమే నినాదంగా వచ్చిన బీఎస్పీని కూడా దళితులు వంద శాతం నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. మొన్న జరిగిన యూపీ ఎన్నికల్లో దళితులు కూడా పూర్తిస్థాయిలో బీఎస్పీకి ఓటు వేయలేదన్నది బీజేపి సాధించిన 325సీట్లతోనే నిరూపితమైంది!

 

తెలిసో, తెలియకో, కావలనో గాని… మన పార్టీలు అంబేద్కరిజాన్ని ఇంకా అంటరానితనం వద్దనే ఆపేస్తున్నాయి. దళితులు అనగానే మన నాయకులు, మేధావులు వివక్షకి గురైన పౌరులుగానే చూస్తున్నారు. నిజంగా దళిత కులాల ప్రధాన సమస్య అంటరానితనమే. కాని, అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. ఇప్పుడు అంటరానితనం పూర్తిగా సమసిపోలేదు. అయినా కూడా దళితులు సామాజిక వివక్షనే కాకుండా ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కోరుతున్నారు. వాళ్లు కూడా విద్యా, ఉ్యదోగం, అభివృద్ధి, ఆధునిక జీవన శైలి వంటివి కోరుతున్నారు. అవన్నీ అందినప్పుడే నిజంగా కూడా వివక్ష దూరమయ్యేది. కేవలం అగ్రవర్ణాల వాళ్లు వచ్చిన పక్కన కూర్చుంటే, ముట్టుకుంటే దళితులకి ఒదిగేం లేదు. వాళ్లు సామాజికంగా, ఆర్దికంగా ఎదగాలి. మిగతా వారికి సమానం అవ్వాలి. సమాన హక్కులు, అవకాశాలు పొందాలి. అలా జరిగేలా చేయకుండా దళితుల కోసమే మేం వున్నామని ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అంబేద్కరిజం అమల్లోకి రాదు! అంబేద్కరిజం అంటే కేవలం ఉపన్యాసాలు, నినాదాలు మాత్రమే కాదు… అంతిమంగా దళితుల అభివృద్ధే అంబేద్కర్ వాదం!