బీజేపీ, శివసేన భాయీ భాయీ...

 

మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరే విషయంలో గత కొన్ని రోజులుగా బీజేపీ - శివసేన మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో చేరడానికి శివసేన అంగీకరించినట్టు తాజా సమాచారం. మంగళవారం నాడు కూడా రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, సోమవారం రాత్రి ముఖ్యమంత్రితో అనేక విషయాలను చర్చించామని శివసేన నాయకుడు సుభాష్ దేశాయ్ తెలిపారు. బీజేపీతో బాగా స్నేహంగా వుండాలంటే ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులను తమ పార్టీకి ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోంది. అయితే బీజేపీ అందుకు అంగీకరించలేదు. మహారాష్ట్ర మంత్రివర్గంలో పది మంత్రి పదవులను శివసేనకు ఇస్తామని, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులకు బదులుగా కేంద్ర మంత్రివర్గంలో మరో మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్‌కి శివసేన ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.