ఆల్ ఫ్రీ.. బట్ కండీషన్స్ అప్లై !

ఆయన ఏమన్నారు? ఇలా ప్రమాణ స్వీకారం  చేయడం, అలా ఫైవ్ గ్యారెంటీలకు పచ్చ జెండా ఊపడం, అని కదా, అన్నారు. అవును, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ప్రతి సభలో  అక్షరం పొల్లుపోకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే  తొలి మంత్రి వర్గ భేటీలోనే ఐదు గ్యారెంటీల అమలుకు పచ్చ జెండా ఊపుతామని కర్ణాటక ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ  ఏమి జరిగింది. ఏమి జరుగుతోంది.  పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనో మరో అనామక నేతో కాదు. ఏకంగా పార్టీ అగ్రనేత, కీలక నేత, పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది.

రాహుల్ గాంధీ నిర్ణయించిన ఉమ్మడి  ముహూర్తం పక్కన పెట్టేసింది. ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ముహూర్తం నిర్ణయించింది. అయినా తొందరేముంది, ఐదేళ్ళు సమయం వుంది.  అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెపుతున్నాం కదా..  ఇంకేం కావాలని, దబాయింపులు మొదలు పెట్టింది. ఐదింటిలో ఒకే ఒక్కటి ‘శక్తి’ పథకానికి మాత్రమే  తొలి నెలలో (జూన్ 11) పచ్చజెండా ఊపేందుకు నిర్ణయించింది. అయితే ఆ ఒక్క పథకం విషయంలోనూ  కండీషన్స్ అప్లై  అంటూ, కొర్రీలు పెట్టింది సిద్దరామయ్య సర్కార్. ఇక్కడికెళ్ళు అక్కడికెళ్ళు.. ఎక్కడి కెళ్ళినా మహిళలలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పడు ఫ్రీ యే  కానీ.. అన్ని బస్సుల్లో కాదు.. ఓన్లీ   ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు (ఎర్ర’)బస్సుల్లో మాత్రమే ఫ్రీ.. అని మెలిక పెట్టింది.

అంతే కాదు  ఈప్రయోజనం పొందాలంటే సేవ సింధు రిజిస్ట్రేషన్ అవసరమని, అందుకు అదార్, రేషన్ కార్డు ఇంకా అనేక ఇతర గుర్తింపు కార్డులు కావాలని కొత్త షరతు విధించారు. అలాగే  భవిష్యత్ లో మరిన్ని మెలికలు పెట్టేందుకు వీలుగా ఆదాయ  పరిమితులు ఇతరత్రా షరతులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి ఇంకా ఇతర కారణాలు లేవని కాదు ఉన్నాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్  లెక్కలను కూడా తప్పు చేస్తూ కాంగ్రెస్ పార్టీ   భారీ మెజారిటీ తో గెలవడానికి మాత్రం ఆ ఐదు గ్యారెంటీలే కారణం. అందులో సందేహం లేదు. అయితే అంతటి భారీ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ  ముఖ్యమంత్రి సిద్దరామయ్య...ఇప్పుడు తీరిగ్గా ఆ ఐదు పథకాల అమలును వాయిదా వేయడమే కాదు  పథకాలకు కోతలు పెడుతున్నారు. 

ముఖ్యంగా అన్నివర్గాల ప్రజలను హస్తం గుర్తుకు ఓట్లు గుద్దేలా చేసిన ఫ్రీ పవర్ ప్రామిస్ (ఉచిత విద్యుత్ హామీ) విషయాన్నే తీసుకుంటే  ఆ పథకం రాహుల గాంధీ వాగ్దానం చేసిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు ఆగష్టు నుంచి మొదలవుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. అంతే కాదు  ఎన్నికల  ప్రచార సమయంలో గృహ జ్యోతి పథకం పరిధిలో 200 యూనిట్ల వరకు ముఖ్యమంత్రి సహా అందరికీ ఫ్రీ అని స్వయంగా సిద్దరామయ్యే ప్రకటించారు. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఉత్తర్వులలో  అందరికీ  200 యూనిట్లు ఉచితం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత సగటు వినియోగానికి అదనంగా మరో పది శాతం వినియోగం వరకు మాత్రమే ఉచితం ఆపైన, ఎంత ఎక్కువ వాడుకుంటే అంతకు చార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఒక కుటుంబం 70 యూనిట్లు వినియిస్తుంటే, ఆగష్టు తర్వాత ఆ కుటుంబం 77 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ వినియోగించుకునే సదుపాయం ఉంటుంది. ఆపైన  ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగించుకున్నా అదనపు వినియోగం వాగ్దానం చేసిన 200 యూనిట్ల లోపలే ఉన్నా, ఆ అదనపు వినియోగానికి బిల్లు చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ మరో కొస మెరుపు ఏమంటే ఉచిత  విద్యుత్ ఆగష్టు నుంచి అమలవుతుంది కానీ అధికారంలో వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన ( యూనిట్ కు రూ.2.89)   విద్యుత్ చార్జీలు మాత్రం వెంటనే  అమలులోకి వచ్చాయి.

ఇదలా ఉంటే ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే సేవ సింధు పోర్టల్లో ఎన్రోల్ కావాలని విధ్యత్ శాఖ మంత్రి ప్రకటించారు. నిజానికి మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రామిస్ చేసిన శక్తి పథకం, అలాగే ఉచిత్ విద్యుత్ పథకం అదే విధంగా ఇతర పథకాలు అన్నిటికీ  కూడా  సేవా సిందు పోర్టల్ లో ఎన్రోల్ తప్పనిసరి చేశారు. అయితే సేవాసిందు పోర్టల్ రిజిస్ట్రేషన్  తప్పనిసరి చేయడంతో పథకం ప్రయోజనాలు పేద ప్రజలకు అందకుండా పోతాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఈ ఐదు పథకాలు కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించదమే కాదు, రానున్న రోజుల్లో తెలంగాణ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలోనూ హస్తం పార్టీని అందలం ఎక్కిస్తాయని లెక్కలు వేస్తున్నారు. అయితే, కర్ణాటకలో ఈ పథకాలకు బ్రేకులు పడితే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉంటుందని అంటున్నారు.