తగ్గనున్న పన్ను భారం.. బడ్జెట్ పై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి. 

2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు.

2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది