ఆంటోనీని కాకాపట్టుట ఎలా?

 

 

 

కేంద్ర మంత్రి ఆంటోని రాష్ట్ర విభజన మీద ఒక నివేదిక తయారుచేసి కాంగ్రెస్ హైకమాండ్‌కి ఇచ్చినట్టు వార్తలు వచ్చినట్టు తెలిసిందే. ఆంటోనీ గారు ఆంధ్రప్రదేశ్‌ ముఖం చూడకుండానే, అనారోగ్యంతో బెడ్‌రెస్ట్ తీసుకుంటూనే ఎప్పుడు విభజన సమస్యని స్టడీ చేశారోగానీ మొత్తానికి ఒక నివేదిక మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానికి సమర్పించారని వినిపించింది.

 

 

ఆ నివేదికలో ఉన్నాయని భావిస్తున్న అనేక అంశాలు తెలంగాణవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాయి. వాటిలో చాలా ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన కాలం నుంచి వర్తించేలా జీవోలు జారీ చేయకూడదన్న అంశం. ఇది తెలంగాణవాదులకు దడపుట్టేలా చేసింది. రేపు నిజంగా తెలంగాణ ఏర్పడితే భూములు తదితర అంశాల విషయంలో గడచిన కాలం నుంచి వర్తించేలా జీవోలను జారీ చేసి సీమాంధ్రుల సంగతి తేల్చాలన్న పథకం తెలంగాణ వాదుల్లో వుంది.




కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో భూములు కొన్న సీమాంధ్రులను వేధించే ప్రణాళిక తెలంగాణ వాదుల్లో వుంది. జీఓఎం సమావేశం సందర్భంగా అసదుద్దీన్‌తో ఆంటోనీ తాను కాంగ్రెస్‌కి ఎలాంటి నివేదిక సమర్పించలేదని చెప్పారు. అయినా సరే ఆంటోనీ నివేదిక ఇచ్చే వుంటారని, అందులో తాము భయపడుతున్న అనేక అంశాలు వుండే వుంటాయని టీ కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. ఆంటోనీ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా తెలంగాణ బిల్లులో చేరిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రులను సాధించే అవకాశం వుండదని బాధపడుతున్నారు.




తెలంగాణ వచ్చినా సీమాంధ్రుల జుట్టు తమ చేతిలోనే వుండాలని టీ కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఉందో లేదో తెలియని ఆ నివేదికలో మార్పులు చేర్పులు చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఆంటోనీ సార్ని ఎలా కాకాపట్టాలో చెప్పండి మహాప్రభో అని జైపాల్‌రెడ్డిని ఆశ్రయించారు. ఈ అంశం మీదే శుక్రవారం నాడు ఢిల్లీలోని జైపాల్‌రెడ్డి నివాసంలో సమావేశమై ఆంటోనీని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలన్న అంశం మీద గంటలు గంటలు చర్చించారు. ఇంతకీ ఈ సమావేశంలో ఆంటోనీని బుట్టలో వేసుకునే మార్గం దొరికిందో లేదో!