కేజ్రీవాల్ క్రేజీ ఆలోచన!

 

 

 

అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ ప్రజలు పెంచుకున్న భ్రమలు మంచు పొరల్లా కరిగిపోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా రాజకీయ పార్టీలన్నిటి కంటే డిఫరెంట్ అని అపోహ పడిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు తమ తప్పుకు తామే లెంపలు వేసుకుంటున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే కేజ్రీవాల్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడో ఆ కాంగ్రెస్ పార్టీతోనే చెట్టపట్టాల్ వేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కి కూర్చున్న కేజ్రీవాల్‌ని చూసి ఢిల్లీ ప్రజలకు నోట మాట రావడం లేదు.

 

అధికారంలోకి  రాకముందు ఏ ప్రగల్భాలు అయితే పలికారో  అధికారంలోకి వచ్చాక వాటికి వ్యతిరేకమైన పనులు చేయడం ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార నివాసం వద్దనడం, అధికార కార్లు వద్దనడం దగ్గర్నుంచి అనేక విషయాలలో కేజ్రీవాల్ రివర్స్ గేర్ వేసేశారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా అవినీతిని ఊడ్చడానికి ఉపయోగించాల్సిన చీపుర్ని అవినీతి మురికి పట్టిపోయిన హస్తానికి అందించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఢిల్లీ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చి మంచి చేసుకోవాలని కేజ్రీవాల్ ప్రయత్నించినప్పటికీ, ఆయన పరిపాలన మీద ఢిల్లీ ప్రజల్లో ఇప్పడికే అసంతృప్తి ప్రారంభమైంది. మిగతా రాజకీయ పార్టీలకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతమాత్రం భిన్నం కాదన్న అభిప్రాయం ఢిల్లీ ప్రజల్లో వ్యక్తమవుతోంది.



ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే ఢిల్లీలో బీజేపీకి సంపూర్ణ అధికారం రావడంతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కళ్ళ ముందు అధికార తెరలు కప్పుకుపోయిన కేజ్రీవాల్ ఆలోచనలు మాత్రం మరోలా వున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా పోటీ చేసే ఆలోచనలో ఆయన వున్నారు. స్థానికంగా వుండే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా భారీ స్థాయిలో లోక్‌సభ స్థానాలు పొందవచ్చన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. అప్పనంగా దక్కిన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంతో సంతృప్తి పడకుండా ఏకంగా దేశ ప్రధాని పదవి మీదే కేజ్రీవాల్ కన్ను వేసినట్టు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో రాజకీయంగా తనకు ఉపయోగపడే ప్రాంతీయ పార్టీలతో కేజ్రీవాల్ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాల్లో తనకు క్రేజ్ తగ్గిపోయిందన్న విషయం కేజ్రీవాల్ తెలుసుకుంటే మంచిది.