మనతో పాటు మరో ఐదు దేశాలు

బ్రిటిష్ పరిపాలన నుంచి 15 ఆగస్టు 1947లో భారతదేశానికి విముక్తి లభించింది. లక్షలాది మంది స్వాతంత్య్రం సమరంలో పాల్గొన్ని తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి భారతమాతకు స్వేచ్ఛ ప్రసాదించిన రోజుగా, జాతీయ పర్వదినంగా భావిస్తాం. దాంతో గత 73ఏండ్లుగా ఆగస్టు 15వ తేదీని దేశ స్వాతంత్య్రం దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. వాడవాడలా జాతీయ జెండాను ఎగురవేసి స్వేచ్ఛ పతాక రెపరెప లను ఆస్వాదిస్తాం. అయితే ప్రపంచంలో మరికొన్ని దేశాలు కూడా 15ఆగస్టును స్వాతంత్య్ర దినోత్సవం గా, జాతీయ దినోత్సవంగా జరుపుకోంటున్నాయి.

 

ఉత్తర, దక్షిణ కొరియాలు
1945లో జపాన్ లొంగిపోయిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అప్పటివరకు జపాన్ ఆక్రమణలో ఉన్న కొరియా 15ఆగస్టు 1945న జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందిన సందర్భంగా ఈ రెండు దేశాలు స్వేచ్ఛాదినంగా ( Liberation Day)గా నిర్వహించుకుంటాయి. ఆ తర్వాత కొరియాను  యునైటెడ్ స్టేట్స్ , సోవియట్ యూనియన్ రెండుగా విభజించాయి. ఉత్తర కొరియా,  దక్షిణ కొరియాలుగా విడిపోయాయి. దక్షిణ కొరియాలో అధ్యక్షపాలనా విధానం కొనసాగుతుంది. దక్షిణ కొరియా ప్రజల జీవనప్రమాణం అత్యున్నత స్థాయిలో ఉంది. 2004 నుండి రొబోట్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇక ఉత్తరకొరియా దేశ బడ్జెట్ లో అత్యధికం శాతం రక్షణవ్యవస్థకు కేటాయిస్తూ నియంతృత్వపాలనలో కొనసాగుతోంది. అత్యధిక సంఖ్యలో సైన్యం కలిగిన దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. సైనికుల సంఖ్య పరంగా  ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాలలో చైనా, అమెరికా, భారతదేశాలు ఉన్నాయి. అంతేకాదు అణ్వస్త్రాలు కూడా తయారు చేసింది.


బహ్రెయిన్
ఇది మిడిల్ ఈస్ట్ లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉన్న చిన్న ద్వీపం. పురాతనకాలం నుండి బహ్రయిన్ ముత్యాల ఉత్పత్తికి ప్రసిద్ధి. 19వ శతాబ్దం నాటికి బహ్రయిన్ ముత్యాలు ప్రపంచంలో నాణ్యమైన ముత్యాలుగా గుర్తింపు వచ్చింది. 1521లో పోర్చుగీసు వారు ,  1783లో బని ఉత్బా వంశస్థులు ఈ ద్వీపాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత 1800 చివరిలో యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఒప్పందం ద్వారా ఇది బ్రిటీష్ వారి వశమైంది. ఇక్కడ 1931 లో చమురును కనుగొన్నారు. ఆ తర్వాత చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించారు. చమురు శుద్ధి కర్మాగారం ఉన్న గల్ఫ్‌లోని మొదటి రాష్ట్రాలలో ఒకటిగా గుర్తింపు వచ్చింది. ఐక్యరాజ్యసమితి సర్వే తర్వాత ఇది దేశంగా గుర్తించబడి 15ఆగస్టు 1971లో స్వాతంత్య్ర రాజ్యంగా అవతరించింది. అయితే బ్రిటిష్ వారితో స్నేహ ఒప్పందం కుదుర్చుకుంది. బహ్రెయిన్ బ్రిటిష్ వారి నుంచి  15 ఆగస్టున స్వాతంత్య్రం పొందినప్పటికీ జాతీయ దినంగా నిర్వహించదు. మొదటిసారి బహ్రెయిన్ సింహాసనాన్ని ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా  అధిరోహించిన రోజు 16 డిసెంబర్ ను జాతీయ దినోత్సవంగా నిర్వహించుకుంటారు.
 

లిచెన్ స్టాయిన్
యూరప్ ఖండంలో స్విట్జర్లాండ్, ఆస్ట్రియాల మధ్యన ఉండే ఒక చిన్న దేశం  లిచెన్ స్టాయిన్ . యూరప్ లోని నాల్గవ అతి చిన్న దేశం ఇది. అంతేకాదు అత్యధిక జిడిపి కలిగిన దేశం. ఈ దేశంలోనూ 15ఆగస్టును జాతీయ దినోత్సవంగా నిర్వహించుకుంటారు. అయితే ఈ దేశానికి ఇది స్వాతంత్య్రం వచ్చిన రోజు కాదు. ఆ దేశ యువరాజు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకునే జాతీయ పండుగ రోజు.   లిచెన్ స్టాయిన్ యువరాజు  ప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ II పుట్టినరోజు 16 ఆగస్టు. ముందు రోజు రాత్రి నుంచే ఆ దేశంలో ఉత్సవాలు చేసేవారట. 1989 లో ప్రిన్స్ మరణం తరువాత, జాతీయ సెలవుదినాన్ని15 ఆగస్టు గానే  రోజున ఉంచాలని నిర్ణయించారు. దాంతో ఇప్పటికీ 15 ఆగస్టును ఆ దేశంలో జాతీయదినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు.

 

కాంగో
మధ్య ఆఫ్రికాలోని ఒక దేశం. అపారమైన ఆర్థిక వనరులతో కూడిన విస్తారమైన దేశం.  15 ఆగస్టు1960 న  ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ కాంగో  పూర్తి స్వాతంత్య్రం పొందింది.  ఆఫ్రికాలో అధికంగా పట్టణీకరణ చెందిన దేశాలలో కాంగో ఒకటిగా ఉంది. దేశంలో 62 మాట్లాడే భాషలు వాడుకలో ఉన్నాయి. విద్యాబోధన అన్ని స్థాయిలలో ఫ్రెంచిభాషలోనే ఉంటుంది.