కేసీఆర్ లీల.. విలీనం గోల!

Publish Date:Nov 13, 2013

Advertisement

 

 

 

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే... చూరులో చుట్ట కాలి ఇంకొకడు ఏడిచాడంట. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఇలాగే వుంది. ఒకపక్క రాష్ట్రాన్ని విభజించొద్దు మహాప్రభో అని తెలుగుజాతి మొత్తుకుంటూ వుంటే, మరోపక్క కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు విలీనానికి సంబంధించిన డ్రామాలు ఆడుతున్నాయి. తెలుగుజాతి సమాధి మీద మరమరాలు, చిల్లరడబ్బులు ఏరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అడ్డగోలుగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిపోతుందని కాంగ్రెస్ నాయకులు భావించారు. తద్వారా రాహుల్‌బాబు ప్రధాని కావడానికి వీలవుతుందని ఆశించారు.

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఓకే అన్న తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన విశ్వరూపం చూపించాడు. విలీనం విషయంలో దాగుడు మూతలు ఆడటం ప్రారంభించాడు.  ఆ దాగుడు మూతలు ముదిరిపోయి- ‘‘అసలు తమ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిన అవసరమే లేదు.. వచ్చే ఎన్నికలలో మా పార్టీయే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కే అధికారం కట్టబెట్టాలని కోరుకుంటున్నార’’ని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ గతుక్కుమంది. కేసీఆర్‌ని నమ్ముకుని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కేసీఆర్ ఇలా ప్లేటు ఫిరాయించాడేంటా అని టెన్షన్ పడిపోయింది. టెన్షన్ తగ్గిన తర్వాత తన మార్కు రాజకీయాలకు తెరతీసింది.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సీమాంధ్రులకు అనుకూలంగా మారిపోయినట్టు.. తెలంగాణ ఇచ్చినా విభజనవాదులకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్నట్టుగా పరిస్థితులు క్రియేట్ చేసింది. విభజన ప్రక్రియని సంక్లిష్టం చేసింది. దాంతో కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లైనులోకి వచ్చాడు. కాంగ్రెస్‌ని మంచి చేసుకుని విభజనలో తెలంగాణకి ఎక్కువ మేలు జరిగి, సీమాంధ్రులకు గుండుకొట్టేలా చేయాలని ప్లాన్ వేశాడు. తన దగ్గర సిద్ధంగా వున్న విలీనం ప్రతిపాదనని మరోసారి తెరమీదకి తెచ్చాడు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం కాదని తాను చెప్పలేదని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత విలీనం సంగతి ఆలోచిస్తానని కాంగ్రెస్ పార్టీకి ఓ బిస్కెట్ వేశాడు. ఆ బిస్కెట్ అందుకున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద తన విశ్వాసాన్ని ఎలా చూపిస్తుందో వేచిచూడాలి.

By
en-us Political News