బాబు, మోడీల అంతర్గత చర్చలు
posted on Oct 3, 2013 11:17AM
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుల మధ్య అనుబంధం పూర్తిగా బలపడినట్లు కనిపిస్తోంది. బుధవారం సదస్సులో వీరిద్దరూ వేదికపైకి కలసికట్టుగా వచ్చి కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రారంభోపన్యాసంలో అభివృద్ధి గురించి, కాంగ్రెస్ పార్టీ దోపిడీ గురించి తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు మోడీ ఆసక్తిగా విన్నారు. అంతేకాదు.. వీరిద్దరూ దాదాపు అరగంట సేపు ఏకాంత చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలూ దేశ రాజకీయ పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకోవడమే కాక, ఎన్నికల పొత్తులపై కూడా నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే భావసారూప్యం గల పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా ఉదయం సభాస్థలిలో ప్రవేశించినప్పటి నుంచీ ఇద్దరు నేతలూ దాదాపు కలిసే గడిపారు. విద్యార్థులతో మంతనాలు జరిపారు. ఇంచుమించు 8 గంటలపాటు ఇద్దరూ అలా కలిసే గడపడం, పక్కపక్కనే కూర్చోవడం, ఒకర్నొకరు ప్రశంసించుకోవడంతో వారిమధ్య స్నేహం బలోపేతమైందనడానికి నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు.