విభజనుల గుండెల్లో రాయి

 

Task Force on A P bifurcation,  Task Force on A P, telangana state, telangana agitation in ap, samaikyandhra

 

 

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల మీద పడే ప్రభావం, మావోయిస్టుల ప్రాబల్యం, హైదరాబాద్ స్థాయి... ఇలాంటి అంశాలన్నింటినీ అధ్యయనంచేయడానికి కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ చకచకా రంగంలోకి దిగిపోయింది. వారం రోజుల వ్యవధిలోనే కేంద్రానికి నివేదిక అందించాల్సి వున్న కారణంగా ఈ టాస్క్‌ఫోర్స్ మెరుపు వేగంగా పనిచేస్తోంది.

 

ఇప్పటికే మాజీ డీజీపీలతో ఒక సమావేశాన్ని నిర్వహించేసింది. కేంద్రం ఈ టాస్క్‌ఫోర్స్ ఫోర్స్‌ ఏర్పాటు చేయడం విభజన వాదుల గుండెలో రాయిపడేలా చేసింది. తెలంగాణ ప్రక్రియను మరింత ఆలస్యం చేయడానికో, హైదరాబాద్ మీద సీమాంధ్రులకు కూడా శాశ్వత హక్కు కల్పించడానికో ఒక పథకం ప్రకారం కేంద్రం ఈ టాస్క్‌ఫోర్స్‌ని రంగంలో దింపిందన్న ఆందోళనను విభజనవాదులు వ్యక్తం చేస్తున్నారు.


టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేకపోవడం, మాజీ డీజీపీల సమావేశానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ అధికారి, టీఆర్ఎస్ సభ్యుడు పేర్వారం రాములుకు ఆహ్వానం అందకపోవడం విభజన వాదుల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.  తమ ప్రాంతానికీ భాగస్వామ్యం కల్పించాలని టీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్, కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ని కేంద్రం పట్టించుకుంటుందో లేదో చూడాలి. టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన తొలిరోజు సమావేశంలో హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పోలీసింగ్ వ్యవస్థ ఉండాలన్న అంశం మీద చర్చ జరగడం దేనికి సంకేతంగా భావించాలో అర్థంకాక విభజన వాదులు తలలు పట్టుకుంటున్నారు. అటూ ఇటూ చేసి ఈ టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌ని తమకి కాకుండా చేస్తుందేమోనన్న ఆందోళన విభజన వాదుల్లో ఏర్పడింది.