చెల్లితో జగన్‌కి చెడిందా?

 

 

 

జగనన్న వదిలిన బాణం షర్మిల. ఇప్పుడు జగన్‌కి, షర్మిలకి మధ్య అగాథం పెరిగిందా అనే సందేహాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జీవించి ఉండగా కానీ, ఆ తర్వాత కానీ ప్రజా జీవితంలోకి వచ్చి ఎరుగని షర్మిల జగన్ జైలుకు వెళ్ళడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.

 

జగన్ జైలులో వున్నాడు.. ఇప్పడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేదెవరన్న సందేహాలు కలిగినప్పుడు నేనున్నానంటూ షర్మిల తల్లితో కలసి ముందుకు వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జనం మరచిపోకుండా ఉండటం కోసం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటించారు. జగనన్న వదిలిన బాణాన్నంటూ తనను తాను చాటుకుని అతి కొద్దికాలంలోనే రాజకీయంగా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. వైరి పక్షాల మీద ఘాటైన విమర్శలు చేస్తూ జగన్ ఇంకొంతకాలం బయటకి రాకపోయినా షర్మిల పార్టీని మేనేజ్ చేయగలదన్న నమ్మకాన్ని కలిగించారు.



జగన్ జైలు నుంచి తెలంగాణవాదం, సమన్యాయ వాదం, సమైక్యవాదం.. ఇలా ఏ వాదం గురించి మాట్లాడమంటే ఆ వాదాన్ని వినిపించి తండ్రికి తగ్గ కూతురు, అన్నకి తగ్గ చెల్లి అనిపించుకున్నారు.  జగన్ జైలులో నిరాహార దీక్ష చేసినప్పుడు జైలుకి వెళ్ళి పరామర్శించిన షర్మిల ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. జగన్ జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత ఎక్కడా షర్మిల పేరు వినిపించలేదు.



తాజాగా జగన్ హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య శంఖారావ సభకు విజయమ్మ, షర్మిల వచ్చినప్పటకీ వేదిక మీదకు రాకుండా కిందే ఉండిపోయారు. మంచి వాగ్ధాటి వున్న షర్మిల వేదిక మీదకు వచ్చి మాట్లడకపోవడం వెనుక ఏదో ఆంతర్యం వుందని, వీరిమధ్య పెరుగుతున్న అగాధానికి ఇదొక నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. షర్మిలకు, జగన్ భార్య భారతికి మధ్య అభిప్రాయ భేదాలున్నాయని అంటారు. ఈమధ్య కాలంలో అవి మరింత పెరిగాయని, అందువల్లే జగన్‌కి, షర్మిలకు మధ్య దూరం పెరుగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.