ఎమ్మెల్యేగా బాలయ్యకి నూటికి నూరు మార్కులు

 

నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలో హిందూపురం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నప్పుడు తను సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన నియోజక వర్గం, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని, తన నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేసి జిల్లాలో చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆయన తరచూ తన నియోజక వర్గం, జిల్లాలో పర్యటిస్తూ సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకొంటూ వస్తున్నారు. అంతే కాదు తన నియోజక వర్గంలో తరచూ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ మూడు నెలలకొకమారు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో తన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు గురించి తెలుసుకొనేందుకు నివేదికలు తెప్పించుకొని వారి పని తీరుని సమీక్షించి, అవసరమయిన సూచనలు, సలహాలు, పనిచేయని వారికి హెచ్చరికలు, మందలింపులు చేస్తుంటారు. తాజాగా తెప్పించుకొన్న నివేదికలో అనంతపురం జిల్లాలో అందరికంటే బాగా నందమూరి బాలకృష్ణ తన నియోజక వర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొనబడింది. సినిమాలలో క్షణం తీరిక ఉండనప్పటికీ ఆయన తన నియోజకవర్గ ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారని నివేదికలో పేర్కొనబడింది. కనుక జిల్లాలో ఉన్న 12మంది కంటే బాలయ్య బాబే నెంబర్:1స్థానంలో ఉన్నారని తెలిసింది. అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా ఆయన ఈవిధంగా మంచిపేరు తెచ్చుకోవడం చాలా అభినందనీయం.