పగ తీర్చుకోవడం ఎలా?

పూర్వం చైనాలో లిలి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి తనకి నచ్చిన అబ్బాయితోనే పెళ్లి జరిగింది. అంతవరకూ బాగానే ఉంది కానీ, లిలికి ఆమె అత్తగారంటే పడేది కాదు. ఏదో ఒక విషయంలో వారిద్దరూ నిరంతరం గొడవపడుతూనే ఉండేవారు. పైగా భర్త కూడా తల్లి మాటలలో నిజం ఉందని తేల్చడంతో లిలి అహం తరచూ దెబ్బతినేది. అత్తగారు లిలిని ఏదో ఒక విషయంలో సరిదిద్దేందుకు ప్రయత్నించడం, దానికి లిలి ప్రతిఘటించడం వారి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కొన్నాళ్లకి లిలి విసిగివేసారిపోయింది. ఎలాగైనా సరే తన అత్తగారి పీడను వదిలించుకోవాలని అనుకుంది. అందుకు తగిన మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా, తన కుటుంబ స్నేహితుడైన ఒక వైద్యుడు గుర్తుకువచ్చాడు. ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లి తన క్షోభ అంతా వెళ్లగక్కింది లిలి. ఎలాగైనా ఏదో ఒక మందు ఇచ్చి తన అత్తగారి పీడని వదిలించమని వేడుకొంది.


లిలి మాటలు విన్న పెద్దాయన కాసేపు ఆలోచించాడు. ఆ తరువాత తన ఇంటి వెనుక ఉన్న గదిలోకి వెళ్లి, ఒక మందు సీసాతో తిరిగివచ్చాడు. ‘‘చూడు! ఇది మనుషులను నిదానంగా చావుకి చేరువచేసే మందు. మీ అత్తగారికి అనుమానం రాకుండా రోజూ ఆమె తినే తిండిలో కలుపుతూ ఉండు. ఒక మూడు నెలల నుంచి ఈ మందు తన ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ఆర్నెళ్లు తిరిగేసరికల్లా మీ అత్తకి ఆఖరి ఘడియలు ముంచుకొస్తాయి. కాకపోతే ఒక్క విషయం! మీ అత్త చావుకి కారణం నువ్వే అన్న అనుమానం ఎవ్వరికీ రాకుండా ఉండాలి. అందుకోసం నువ్వు ఆమెతో ప్రేమగా ఉంటున్నట్లు నటించాలి,’’ అంటూ ఆ మందు సీసాని లిలి చేతిలో ఉంచాడు వైద్యుడు.


అర్నెళ్లు తిరిగే సరికి తన అత్త తన జీవితంలో ఉండదన్న సంతోషంతో పొంగిపోతూ లిలి ఇల్లు చేరుకుంది. ఆ రోజు నుంచి తన అత్తతో ప్రేమగా ఉంటూ కొంచెంకొంచెంగా ఆ విషాన్ని ఆమె ఆహారంలో కలపసాగింది. రోజులు గడిచేకొద్దీ ఆమె చూపించే అనురాగానికి అత్త లొంగిపోయింది. లిలిలాంటి కోడలు తనకి దొరకడం అదృష్టమంటూ ఊరూవాడా చెప్పుకొని తిరిగేది అత్త. లిలి మనసులో కూడా అత్త పట్ల అనురాగం మొదలైంది. ఆమెని చూస్తుంటే చనిపోయిన తన తల్లి గుర్తుకురాసాగింది. అలా ఓ మూడు నెలలు గడిచేసరికి, ఆమెను తన చేతులతో చంపుతున్నానన్న విషయాన్ని సహించలేకపోయింది లిలి. వెంటనే ఆ వైద్యుడి దగ్గరకు పరుగులెత్తింది. ‘‘ఏదో మొదట్లో నేనూ మా అత్తా గొడవపడిన మాట నిజం. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె నా మంచి కోసమే విమర్శించేదని తెలిసొచ్చింది. నేను ప్రేమగా ఉండేసరికి మా అత్త కూడా నాలో లోపాలను వెతకడం మానివేసింది. దయచేసి ఇన్నాళ్లూ నేను ఆమెకు పెట్టిన విషానికి విరుగుడు మందుని ఇవ్వండి,’’ అంటూ వైద్యుని ప్రాధేయపడింది లిలి.


వైద్యుడు చిరునవ్వుతో- ‘‘నేను నీకిచ్చిన మందులో విషం లేనేలేదు. విషం ఉన్నదల్లా నీ మనసులోనే. ఆ విషానికి విరుగుడు స్నేహం, సహనం అని నాకు తెలుసు. ఆ విషయాన్ని నీకు తెలిసేలా చేసేందుకు ఈ నాటకం ఆడాను. నీలో ఎప్పుడైతే ప్రేమ కనిపించడం మొదలైందో... అది నీలోనూ, నీ అత్తగారిలోనూ ఉన్న ద్వేషాన్ని జయించింది. వెళ్లి నీ అత్త, భర్తలతో హాయిగా ఉండు,’’ అంటూ పంపించాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)