కేసీఆర్ కు షాక్.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆయనేనట..!!

 

ఎన్నికలు సమీపిస్తుంటే.. తమ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? తమ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా? అని అన్ని పార్టీలలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రం వీటితో పాటు మరో ఆసక్తికరమైన విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు?. ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ లో నాయకులు ఎక్కువ. వారిలో చాలామంది 'నాకేం తక్కువ.. నేనే సీఎం అభ్యర్థిని' అనే భ్రమలో ఉంటారు. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పి. సీఎం అభ్యర్థిగా ఎవరు పేరు చెప్తే ఎవరు భగ్గుమంటారో.. దాని వల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో అని అధిష్టానం భయపడుతూ ఉంటుంది. అదీగాక కాంగ్రెస్ లో రెడ్డి సామజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువ. ఇంచుమించు అందరూ నేనే తోపు అనే భ్రమలో ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం వారిలో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇంకేమన్నా ఉందా?.. మాకేం తక్కువ అంటూ అల్లకల్లోలం చేసేయరు. అందుకే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. ఒకేసారి తెరాస పార్టీ జోరుకు, కాంగ్రెస్ పార్టీ వర్గ పోరుకు చెక్ పెట్టే ప్లాన్ వేసిందట. అదేంటంటే దళిత నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం.

 

 

గత ఎన్నికలకు ముందు తెరాస దళిత నేతను సీఎం చేస్తామని చెప్పింది కానీ డిప్యూటీ సీఎం తో సరిపెట్టింది. ఇప్పుడు దీన్నే కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకోవాలని చూస్తోందట. దళిత నేతను సీఎంని చేస్తామని చెప్పడం కాదు.. చేసి చూపిస్తాం అనే మాటను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చూస్తున్నారట. అదీగాక గతంలో టీ.అంజయ్య, సంజీవయ్య వంటి నేతలను సీఎంలను చేసిన ఘనత కాంగ్రెస్ కి ఉంది. ఆ పాయింట్ ను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. ఇలా వ్యూహాత్మ‌కంగా ద‌ళితుడికి సీఎం పీఠం క‌ట్ట‌బెడ‌తామ‌ని చెప్ప‌డం మూలంగా ఇటు తెరాసకు, అటు కాంగ్రెస్ వర్గపోరుకు చెక్ పెట్టొచ్చని భావిస్తోందట. ప్రస్తుతం కాంగ్రెస్ అడుగులు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. తాజాగా ఏఐసీసీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలలో ప్రచార కమిటీ, మానిఫెస్టో వంటి కీలక కమిటీల చైర్మన్ లు గా ఎస్సీ సామాజికవర్గాల వారిని నియమించటం వెనుక కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటో అర్థమౌతుంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ను ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా నియ‌మించ‌డాన్ని చూస్తుంటే ఆయ‌నే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్య‌ర్థేమో అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో పాటు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను కూడా మేనిఫెస్టో క‌మిటీకి చైర్మ‌న్ గా చేయ‌డం, అలాగే అన్ని విభాగాల్లోనూ ద‌ళిత స‌భ్యులు ప్ర‌ముఖంగా ఉండ‌టం చూస్తుంటే కాంగ్రెస్ స్ట్రాటజీ దళిత సీఎం అనే అనిపిస్తోంది. మరి కాంగ్రెస్ గతంలో తెరాస చెప్పిన దళిత సీఎం కాన్సెప్ట్ ను తెరమీదకు తీసుకొచ్చి తెరాసను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి మరి.