ముందస్తుకి జైకొడితే… విజయోస్తు గ్యారెంటీనా?

 

రాజకీయాల్లో ఎన్నికలు అనివార్యం. భారీ ఖర్చులు చేసి , రాత్రింబవళ్లూ ఒళ్లు హునమయ్యేలా ఊరారా తిరిగి ఓట్లు అర్థించాలని రాజకీయ నేతలకు కూడా వుండదు. అయినా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ లేకుండా బండి నడవదు. అందుకే, అయిదేళ్లకొకసారి దేశం దేశమంతా బ్యాలెట్ వార్ లో తలమునకలైపోతుంది! నాయకులు టెన్నన్ గా, జనం అటెన్షన్ గా ఎన్నికల్ని ఎదుర్కొంటూ వుంటారు! అయితే, పైకి కనిపించే ఎన్నికల ఎంటర్టైన్మెంట్ వెనుక చాలా పెద్ద మ్యాథమెటిక్సే వుంటుంది. ప్రతీ తిక్కకూ ఒక లెక్క వుంటుంది!

 

ఎన్నికలంటేనే రాజకీయ నేతలు ఇబ్బందిగా ముఖం పెడతారు. అదీ అధికారంలో వున్నవారైతే ఎలక్షన్స్ రావాలని అస్సలు కోరుకోరు. ఎందుకంటే, అది ఏ విధంగా చూసినా రిస్కే! జనం వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఎక్కువ! అయితే, ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం ముందస్తు కోలాహలం నడుస్తోంది. సీఎం చంద్రబాబు 2019 సంగ్రామం 2018లోనే వచ్చేస్తుందని సంకేతాలు ఇస్తున్నారు. ఇంకా పక్కాగా ప్రీ ఎలక్షన్స్ అంటూ ప్రకటించలేదు కాని… మీడియాకి, క్యాడర్ కి సిగ్నల్స్ అందుతూనే వున్నాయి. ఇంతకీ, ఏపీ ముఖ్యమంత్రి ఎందుకని ముందస్తుకి ముందుకు దూకుతున్నట్టు?

 

రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం చంద్రబాబుకి క్షేత్ర స్థాయిలో జరుగుతోన్న పరిణామాలపై పక్కా రిపోర్ట్ వుందని తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన అనేక ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగిస్తోంది. ఓటములు కూడా వున్నాయి. అయినా కూడా ఏదో ఒక సీటు గెలిచిన ప్రతీ చోటా టీడీపీ ఓట్ల శాతం క్రమంగా పెరుగుతోంది. ముస్లిమ్, ఎస్సీ వర్గాల్లో ఈ మార్పు మరింతగా కనిపిస్తోందట. తెలంగాణ, ఆంధ్రాగా సమైక్య రాష్ట్రం విడిపోయాక 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు జనం అనుభవంలో సీనియర్ అయిన చంద్రబాబుకే పట్టం కట్టారు. భారీగా ఓట్ల శాతం తేడా లేకున్నా క్లియర్ మెజార్టీ వచ్చింది టీడీపీకి. జనం పెట్టుకున్న ఆశలకి తగ్గట్టుగానే చంద్రబాబు అమరావతి నిర్మాణం, తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్ ల ఏర్పాటు వంటి పనులు సమర్థం చేశారు. రైతుల్నుంచీ భూములు సంపాదించటం కూడా మరీ సమస్యాత్మకం కాకుండా సాధించగలిగారు. ఇలా కొత్త రాష్ట్రానికున్న బాలారిష్టాల్ని విజయవంతంగానే ఎదుర్కొన్నారు. ఇదే ఇప్పుడు కింది స్థాయిలో టీడీపీకి అనుకూలంగా వుందని రిపోర్ట్స్ వచ్చాయంటున్నారు. మంత్రిగా మారి మరింత క్రీయాశీలకం అయిన చినబాబు కూడా చంద్రబాబుతో టీడీపీ దూకుడును చర్చించారంటున్నారు. జనంలో మంచి మూడ్ వున్నప్పుడే ఎలక్షన్స్ కి వెళితే మరో అయిదేళ్లు అధికారం చేజిక్కించుకోవచ్చని ఆయన అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి!

 

ముందస్తుకి వెళ్లటంలో చంద్రబాబు మరో కాలిక్యులేషన్ కూడా వుండవచ్చు. జగన్ అవినీతి కేసులు ఇంకా తెరిపిని ఇవ్వలేదు. ఏ క్షణం ఏమవుతుందోనన్న టెన్షన్ ప్రతిపక్ష నేతలో వుంది. అందుకే, ఒత్తిడి పెరిగిన ప్రతీసారి దిల్లీ ఫ్లైటెక్కి మొక్కులు చెల్లించుకుని వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ముందస్తు వస్తే ఆయన ఎలక్షన్స్ పై పూర్తి స్థాయిలో కాన్సన్ ట్రేట్ చేసి గెలవటం కాస్త కష్టమైన విషయమే!

 

ముందస్తుతో జనాన్ని మెప్పించి, జగన్ ని తప్పించి… తిరిగి అధికారంలోకి రావటం మంచి వ్యూహమే! కాని, ఇందులో చాలా చాలా రిస్క్ వుందంటున్నారు రాజకీయాల్లో తలపండిన వారు. ఎక్కడ ఏ తేడా జరిగినా మొత్తమంతా తలక్రిందలు అవ్వొచ్చంటున్నారు. ఉదాహరణగా, 2004ను చూపుతున్నారు. అప్పట్లో వాజ్ పేయ్ ముందస్తుకు ముందకు కదిలారు. అలిపిరి దాడి నుంచి తప్పించుకున్న చంద్రబాబు కూడా కూడికలు , తీసివేతలు చేసుకుని ఎన్నికల బరిలో కాలుపెట్టారు. కాని, ఫలితం అనూహ్యంగా వచ్చింది. పదేళ్లు అధికారానికి దూరం చేసింది. ఇప్పుడూ అలాంటి పరిణామం వుండబోదని గ్యారెంటీ లేదు. అందుకే, సర్వేలు, రిపోర్టులు ఒకటికి పదిసార్లు సరి చూసుకుని పంజా విసిరితే బావుంటుంది! ఆఫ్ట్రాల్… పాలిటిక్స్ ఈజ్ మోర్ మ్యాథ్స్ ద్యాన్ సోషల్!