అమరావతికి భూములివ్వని రైతులపై కొత్త అస్త్రం


నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైన్ల ప్రక్రియ కొలిక్కి వస్తున్నా.... భూముల వ్యవహారం మాత్రం తేలడం లేదు. 29 గ్రామాల పరిధిలో 33వేల 500 ఎకరాలను భూసమీకరణ కింద తీసుకున్న ప్రభుత్వం.... మరో 3వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడంలో అష్టకష్టాలు పడుతోంది. ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం తదితర గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అనడం, కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా ఎకరం, అరెకరం  బిట్లను ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు.

 

భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చినా, రైతులు కోర్టుకెళ్లడంతో రాజధాని నిర్మాణ ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది. దాంతో భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. అందుకే భూములివ్వని రైతులపై కొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సర్కార్‌ సిద్ధమవుతోంది. భూసమీకరణ లేదా భూసేకరణ కింద భూములు ఇచ్చేందుకు ముందుకురాని రైతుల భూములను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటించనున్నారు.

 

గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తే ఆయా భూముల్లో కేవలం వ్యవసాయ పనులు మాత్రమే చేయడానికి అనుమతి ఉంటుంది. భూములను ప్లాట్లుగా అమ్ముకునే వీలుండదు. దాంతో భూములు ఇవ్వని రైతులు భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోయే అవకాశముంటుంది. అయితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటున్న రైతులు.... తమ పొలాలను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తే, న్యాయ పోరాటం చేస్తామంటున్నారు.

 

గ్రీన్‌బెల్ట్‌ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా రైతులను దారిలోకి తెచ్చుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహామైనా, ఈ నిర్ణయం భవిష్యత్‌లో సర్కార్‌కు కూడా కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశముందని అధికారులు అంటున్నారు.