మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే మోరిలో వేసినట్లే : కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే వారి ప్రజా వ్యతిరేక విధానాలకు, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యానికి, మరియు వారు చేసిన 420 వాగ్దానాల మోసానికి మద్దతు ఇవ్వడమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మొండి వైఖరిని వీడాలంటే, ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా వేములవాడ మరియు సిరిసిల్ల ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్, ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే అడ్డుకోకపోతే, ఆ పార్టీ మరింత రెచ్చిపోయి ప్రజలను పీడిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే అవినీతి, అక్రమాలు మరియు స్కాములతో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా, భారతీయ జనతా పార్టీపై కూడా ఆయన మండిపడుతూ, బీజేపీకి ఓటు వేయడం అంటే అది వృథా చేయడమేనని, మీ ఓటు మోరిలో వేసినట్లే అన్నారు. ఆ పార్టీ కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కులమతాల పేరుతో ఓట్లు వేయించుకొని, ఒట్టు పెట్టించుకుని పదవులు పొంది మాయమవుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై విమర్శలు చేస్తూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు లేదా తెలంగాణ రాష్ట్రానికి ఆయన సాధించిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని, సిరిసిల్ల నేతన్నలు ఎంతో కాలంగా కోరుతున్న మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకువచ్చే శక్తి ఆ పార్టీకి లేదని విమర్శించారు. బీజేపీ కేవలం కులమత రాజకీయాలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 రూపాయలు మరియు 400 రూపాయల పెన్షన్ వంటి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సిరిసిల్లలో బతుకమ్మ చీరల తయారీని రద్దు చేసి నేతన్నల ఉపాధిని దెబ్బతీశారని, నేతన్నలను అవమానపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు. నేతన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వారిని కండోమ్స్ అమ్ముకోండి…పాపడాలు అమ్ముకోండి అంటూ నీచమైన మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు చెప్పుతో కొట్టినట్లు ఎన్నికల్లో సమాధానం చెప్పాలన్నారు. చివరగా, సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లా ఉనికికే ప్రమాదమని కేటీఆర్ హెచ్చరించారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చే కొద్దిపాటి డబ్బులకు లోబడకుండా, మన సొంత పార్టీ అయిన భారత రాష్ట్ర సమితిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Publish Date: Feb 6, 2026 8:41PM