Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 3


    "ఒరేయ్ చూడూ!" సీతారామయ్య గారు అందుకున్నారు. "మొదట్నుంచీ నీ వాలకం గమనిస్తూనే వున్నాను. నాటకాలకు వెళ్ళటం, కచేరీలకు వెళ్ళటం యివన్నీ చెడిపోయే వాళ్ళ బుద్దులుగానీ పైకొచ్చేవాళ్ళ లక్షణాలు కాదురా. మా తాత....ఎవరూ మా తాత....మద్దెల మోజులోపడి, పొలం పుట్రా అమ్ముకున్నాడు. మా నాన్న హార్మనీ పిచ్చిలోపడి, నాటకాల మైకంలో ఉద్యోగం సద్యోగం లేక యిళ్ళూ వాకిళ్ళూ పొగొట్టుకున్నాడు. వొరేయ్! నేను చూడరా నాటకాలకెళ్ళను. కచేరీలకు పోను. స్నేహితుల్నీ, గీహితుల్నీ చేరనివ్వను. అందుకని హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. నీకు మీ తాతముత్తాతల పోలికొచ్చిందేమిట్రా...ఏరా! వింటున్నావా! మనం చాలా సామాన్య కుటుంబీకులం. కష్టపడి చదువుకుంటేగాని యీ సమాజంలొ నెట్టుకురాలేము. ఇహనుంచీ ఫ్లూటనీ గీటని వెధవ్వేషాలు వెయ్యకు. యిలాంటివి మరిచిపో. కష్టపడి చదువు. ఈ ఫ్లూట్ నీకు కూడుపెట్టదు. చదువుకుని డిగ్రీ సంపాదించుకుంటే ఉద్యోగస్థుడి నవుతావు. నామాటమీద గౌరవం వుంచావా? పైకివస్తావు. లేదా నీ ఖర్మాన పోతావు."    
    ఫ్లూట్ అతని ముఖంమీద గిరాటేసి విసురుగా వెళ్ళిపోయాడు.
    రాఘవ మంచంమీదపడి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ ఫ్లూట్ కొనుక్కున్న మొదటిరోజు....ఎన్నాళ్ళనుంచో ఎదురుచూసిన యీ అనుభవం..... యిలా తగలబడిపోయింది. అతని మనస్సు నలిగిపోయింది.
    అతడికి అపారమైన బాధ కలిగిందిగానీ తండ్రిమీద కోపం రాలేదు. ఆయనంటే అంత భక్తి, భయం, గౌరవం.
    తండ్రికి కష్టం కలిగించానన్న పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.
    ఆ తర్వాత ఫ్లూట్ ఎప్పుడు కళ్ళబడినా తప్పుచేసినట్లు బెదిరిపోయేవాడు దాన్ని తాకితే అతని చేతులు వణికిపోయేవి. తండ్రిమాటలే చెవుల్లో ప్రతిధ్వనించేవి.
    
                                  * * *
    
    యిద్దరూ యింటర్మీడియట్ లో చేరారు.
    అదే రోజుల్లో అనంతమూర్తి జీవితంలో కొన్ని మార్పులు రాసాగాయి. కాలేజీ లైబ్రరీలోని అనేక నవలలు ఇంగ్లీషువీ, తెలుగువీ చదవటం తటస్థించింది. అతను సాహిత్యంపట్ల ఏవేవో ప్రేరేపణలు కలగసాగాయి. క్రమంగా అతనికి రాయాలన్న అభిలాష కలిగింది. రాయసాగాడుకూడా.
    క్లాసు పరీక్షలలో రాఘవకు మార్కులు బాగానే వచ్చేవి. ఇదివరకు రాఘవకన్నా బాగా మార్కులువచ్చే మూర్తికి క్రమంగా రాంక్ తగ్గిపోయింది.
    రాఘవ బాధపడ్డాడు. "మూర్తీ నువ్వు వెనక్కి వెళ్ళి పోతున్నావు" అన్నాడు.
    మూర్తి నవ్వాడు. "వెనక్కి వెళ్ళటం లేదు. చదువులో వెనకబడుతున్నాను."
    "అదే నేచెప్పేది. నీకు పుస్తకాలమోజుమరీ ఎక్కువై పోతోంది. ఎప్పుడూ ఏదో రాస్తూంటావుకూడా. ఎందుకలా టైం వేస్టుచేస్తుంటావు?"
    "జీవితాన్ని వేస్టు చేసుకోవటమిష్టం లేక."
    రాఘవ అర్ధంకానట్లు చూశాడు.
    మూర్తి మళ్ళీ నవ్వాడు. "రాఘవా!  ప్రతివ్యక్తికి జీవితంలో ఒక టేస్టు అంటూ వుంటుంది. దాంతో బాటు ప్లానింగ్ వుండాలి. ఆ టేస్టుకు వ్యతిరేకంగా ప్లానింగ్ కూడా చంపేసుకుని జీవిస్తే- జీవితాన్ని వేస్టు  చేసుకోవటమే నని నా ఉద్దేశ్యం."
    "నువ్వనుకుంటూన్న టేస్టు నీ జీవితాన్ని మెరుగులు దిద్దకపోతే?"
    "మరుగున పడిపోతాను. మనిషి అనేక సందర్భాలలో" పరిస్థితుల్లో మరుగున పడిపోతూ వుంటాడు. తను అనుకున్న అనుభవించే ప్రయత్నంలో ఓడిపోవటం తనది కాని జీవితం బ్రతుకుథూ ఓడిపోవటం కన్నా ఎన్నో రెట్లు నయం కదూ."
    "మీ తల్లిదండ్రులు నీకెప్పుడూ చెప్పలేదా?"
    "ఏమని?"
    "పద్దతి మార్చుకొమ్మని."
    "తల్లిదండ్రులుగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేకపోయాను. విసుక్కున్నారు. మందలించారు. బాధపడ్డారు. కాని నేను నేనుగానే ఉండిపోతున్నాను."
    రాఘవ నిట్టూర్చాడు. "తప్పు. తల్లిదండ్రుల గురించి అలా మాట్లాడకూడదు మూర్తీ!" అన్నాడు.
    మూర్తికి అర్ధం కాలేదు. "నేనేం తప్పు మాట్లాడలేదే" అనుకున్నాడు.
    
                                  * * *
    
    అనంతమూర్తి పంపగా పంపగా ఎన్నో తిరిగిరాగా చివరకు అతని కథలు రెండు అచ్చయినాయి.
    అదే రోజుల్లో రాఘవ తల్లిద్రండుల తీర్ధయాత్రలకని రెండు నెలలపాటు యాత్రాస్పెషల్ లొ వెళ్ళటం జరిగింది.
    రాఘవ ఒక్కడే ఇంట్లో వున్నాడు.
    భోజనం గురించి అతనికి బాధలేదు. అతనికి చిన్నప్పట్నుంచీ వంటచేయటం వచ్చు. కూరలు తరగటం, కుంపటి అంటించటం; తిరగమూతలు పెట్టటం అవలీలగా చేసేవాడు అందుకని తానే వండుకుని తిని కాలీజీకి వెళ్ళి వస్తూండేవాడు.
    కాని జీవితంలో యిన్ని రోజుల వంటరితనం యింట్లో ఎప్పుడూ అనుభవించలేదు. పగలు కాలేజి, చదువు, సాయంత్రాలు అనంతమూర్తితో కాలక్షేపం - ఈ వ్యాపకాలతో గడిచిపోయేదిగాని, రాత్రిళ్ళు దిగులుగాగుబులుగా వుండి ఏడుపు వస్తోన్నట్లుగా వుండేది. ఒకరాత్రి యిహ ఏకాంతం భరించలేక పెట్టెలో బట్టల అడుగున పడేసి వుంచిన పిల్లనగ్రోవి తీసి వాయించసాగాడు.
    ఎన్నాళ్ళయిందో యీ మురళి తన పెదవుల్ని తాకి? ఎన్నాళ్ళయిందో మురళిమీద తన పెదవులు కదిలి.
    అనుభూతి చాలా మధురంగా వుంది. అప్పుడే తానిందులో అంత ప్రావీణ్యం సంపాదించాడన్న విషయం కూడా గ్రహించాడు. ఉత్సాహం ఆపుకోలేక పోతున్నాడు. ఈ పెద్దవాళ్ళు, నియమాలూ యిదంతా మిధ్య అనీ, కల్పితం అనీ తనూ, తన చేతిలో మురళి యిదే నిజమైన ఆనందమనీ పదేపదే అనుకున్నాడు.
    ఇహ వ్యామోహం ఆపుకోలేకపోయాడు. ఇంట్లో వున్నంతసేపు అదే ధ్యాశ, అదే తపన. రాత్రిళ్ళు టైము కూడా తెలిసేది కాదు.
    ఓరోజు ఉదయం స్నానంచేసి యింట్లోకి వెడుతూ ప్రక్కింట్లో కొత్తగా దిగినవారి తాలూకు పదహారేళ్ళ అమ్మాయి గోడవతల నుండి చెంపకు చారడేసి కళ్ళతో తన వంక రెప్ప వాల్చకుండా చూడటం గ్రహించి సిగ్గుపడి లోపలకు వెళ్ళిపోయాడు.
    బట్టలేసుకున్నాక ఆ అమ్మాయి అక్క యింకా వుందో లేదోనని, ఏదో పనిమీద వున్నట్లు నటిస్తూ పెరటి లోకి వచ్చాడు.
    ఇంకా అక్కడే నిలబడివుంది.
    ఏం చెయ్యాలో తెలీక పట్టుబడినట్లయిపోయి బలవంతంగా నవ్వాడు.
    ఆ అమ్మాయి కూడా నవ్వింది.
    అక్కడ్నుంచి వెళ్ళిపోదామనుకుని, ఎలా వెళ్ళిపోవాలో కుదరక వున్న చోటనే నిలబడిపోయాడు. కాని అలా నిలబడిపోవటం మనసులో సంతోషాన్ని కలిగిస్తోంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS