Next Page 
స్వర భేతాళం  పేజి 1

         

                                                        స్వర బేతాళం


                                                                     __యండమూరి వీరేంద్రనాథ్



                            ముందొక మాట

                   "మారా....మారా....బచావ్" 
      (చంపుతున్నాడు - చంపుతున్నాడు - రక్షించండి)

    జనవరి 31, 1982 పొద్దున్న 7-50 కి నాంపల్లి రైల్వేస్టేషన్ పక్కనున్న ఇంటి నించి వినిపించిన కేకలివి....

    హోటల్లో టీ తాగుతున్న ఒకరిద్దరు; రాయల్ లాడ్జి బయటనున్న ఆటో డ్రైవర్లు ముగ్గురు అటు వైపు పరుగెత్తారు.   

    కత్తి పట్టుకుని బయటకు వచ్చిన యువకుడిని చూసి అందరూ నిశ్చేష్టులై ఆగిపోయారు. సాహసవంతులైన నలుగురైదుగురు యువకులు మాత్రం అతడిని పట్టుకోవటానికి ప్రయత్నించారు.

    వాళ్ళని కూడా పొడిచి, అతడు స్టేషన్ వైపు పరుగెత్తాడు.

    లోపల ఇంట్లో కత్తిపోట్లకు గురి అయిన వ్యక్తి రక్తంలో గిల గిల కొట్టుకుంటూ మరణించాడు. ఆ వ్యక్తి పేరు మొహిసిన్. అతడొక పోలీసు. హంతకుడి పేరు ధర్మదాస్.

    ధర్మదాస్ పరుగెడుతూ అడ్డుగా వచ్చిన వాళ్ళని పొడవగా గాయపడిన వాళ్ళు మెయినుద్దీన్, సయద్ బాషా, పద్మనాభం, అన్వర్, జబ్బర్ (చివరి ఇద్దరూ ఆటోడ్రైవర్లు) చివరికి జనం ఆ హంతకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అతడి దగ్గిర రక్తంతో తడిసిన పొడవాటి కత్తి లభించింది_అతడు నేరాన్ని వప్పుకున్నాడు. జూన్ 15, 1982 న లోవర్ కోర్టు ధర్మదాస్ కి సెక్షన్ 302 క్రింద ఒక వ్యక్తిని హత్య చేసినందుకూ, పట్టుకోవటానికి ప్రయత్నించిన ఐదుగుర్ని దారుణంగా గాయపర్చినందుకూ  యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.

    ధర్మదాస్ పై కోర్టుకి అర్జీ పెట్టుకున్నాడు.

    6-11-1984 న హైకోర్టు సెక్షన్ 84 ఐ.పి.సి. క్రింద అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.


                           *    *    *

    ....ఆంద్రప్రదేశ్ లో ఆ మాటకొస్తే భారతదేశంలో ఉన్న  కొద్దిమంది ప్రసిద్ధ క్రిమినల్ లాయర్స్ లో ప్రముఖుడు శ్రీ సి. పద్మనాభరెడ్డి.  "అభిలాష" లో కూడా ఈయన పేరు పేర్కొని కృతజ్ఞతలు చెప్పుకొన్న విషయం పాఠకులకు  గుర్తు వుండే వుంటుంది. ఎందుకో ఆయన్ని సంప్రదించటానికి వెళ్ళినప్పుడు  ఆయన క్యాజువల్ గా సెక్షన్ 84 గురించి ప్రస్తావించారు- మాటల సందర్భంలో.

    పెద్ద పెద్ద విషయాలు సంభవించటానికి చిన్న చిన్న సంఘటనలు చాలు.

    అప్పటి వరకూ అస్పష్టంగా కదలాడుతున్న  ఊహలకి ఒక స్పష్టమైన ఆకారం ఏర్పడినట్లయింది. -ఆయన చెప్పిన విషయాలు వింటూ  వుంటే, అదే మీరు చదవబోయే 'స్వర బేతాళం.'

    ధర్మదాస్  కేసులో  డిఫెన్స్  తరపు న్యాయవాది శ్రీ పద్మనాభరెడ్డే! ప్రతిష్టాకరమైన ఈ కేసులో జడ్జిమెంటు ఇచ్చింది మిష్టర్ జస్టిస్ శ్రీ రఘువీర్.  ఆయన తన జడ్జిమెంటులో  ప్రపంచపు వివిధకేసులూ (ఈ రకమైనవి) వాటి పూర్వోత్తరాలూ  పేర్కొన్నారు. (అవన్నీ నవలలో  ప్రస్తావిస్తాను) చివర్లో ఆయన జడ్జిమెంటు  ఈ విధంగా కొనసాగింది.

    "తనకి ఆతిథ్యమిచ్చిన  వ్యక్తిని  ముద్దాయి పొడిచి చంపాడు. కానీ అతడికి తను చేస్తున్న పని ఏమిటో తెలీదు ముద్దాయికి హతుడు "టీ" ఇచ్చి తను బట్టలు వేసుకోవటానికి లేచాడు. అలా లేవటంతో బల్లమీద కత్తి కనపడింది. కత్తిని చూడగానే ముద్దాయి మెదడులో  ప్రకంపనాలు  కలిగాయి. అదేమిటో కేవలం ప్రేతాత్మలకే తెలియాలి. (జస్టిస్ "డెవిల్" అన్న పదం ఇక్కడ  వుపయోగించాడు.) ఆ ఉద్రేకంలో  ముద్దాయి హతుడిని కత్తితో పొడిచి పారిపోయాడు. అడ్డువచ్చిన ఐదుగురిని  గాయపర్చాడు. కానీ ఇదంతా మానసిక సంచలనం వల్లే అతడు చేశాడని మేం భావిస్తున్నాం. అందుకనే అతడిని విడుదల చేస్తున్నాం."

    "మేము తీసుకున్న  ఈ నిర్ణయంలో కొన్ని లొసుగులున్నాయని  మాకు తెలుసు. వీలైనంతవరకూ  ఈ లొసుగుల్ని న్యాయబద్ధంగా  కవర్ చేయటానికి  ప్రయత్నించాము. ఇటువంటి కేసులోనే  ఒకదానిలో చీఫ్ జస్టిస్ హాల్ట్ అనే ఆయన ఉదాహరించిన వాక్యాన్ని  నేను కూడా  ఉదహరిస్తాను. 'నా లొసుగుల్ని భవిష్యత్తులో నాకన్నా తెలివైన మరో న్యాయవేత్త  మరింత బాగా కవర్ చేస్తారని' అప్పటికీ న్యాయశాస్త్రం పకడ్బందీగా వీటిని పూరించి మా (జడ్జీల) పని సులువయ్యేలా చేస్తుందనీ ఆశిస్తున్నాము."


                          *    *    *   


    ఈ ప్లాట్ ఆధారంగా, ఏ విధంగా  అభిలాషలో  సెక్షన్ 302 గురించి చర్చించటం జరిగిందో ఆ పద్ధతిలో సెక్షన్ 84 గురించి చర్చించాలన్న నా అభిలాష ఎంతవరకు నెరవేరిందో పాఠకులే చెప్పాలి.

    చివర్లో  ఒకమాట. ఈ నవలలో  పాత్రలు  కేవలం కల్పితాలు. పైన ఉదహరించిన జడ్జిమెంటు ఆధారంగా పొందినది. "ప్రేరణ" మాత్రమే! ఎవరినీ  ఉద్దేశించి వ్రాసింది కాదు. చాలా సంఘటనలు మాత్రం యదార్ధంగా జరిగినవి. వాటి పోలిక ఆధారంగా కథ అల్లబడింది.

                                                                                                               __ వీరేంద్రనాథ్ 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS