Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 2

               
                           స్వర బేతాళం

    Nothing is an offence wnich is done by a person, who, at the time of doing it, by reason of unsoundness of mind, is incapable of knowing the nature of the act,
   
                see. 84.
            Indian penal code.


                                 *    *    *


    "నీ పేరు ?"
   
    "శివయ్య"

    "వారింట్లో నువ్వెంతకాలం  నుంచి పని చేస్తున్నావు ?"

    "పదిహేను సంవత్సరాల్నుంచీ బాబూ."

    "మీ అయ్యగారూ, అమ్మగారూ  తరుచు దెబ్బలాడుకునేవారా ?"

    "లేదండి. అయ్యగారు అమ్మగార్ని చాలా ప్రేమగా  చూసుకునే వారు. కానీ అయ్యగారికి దెయ్యం పట్టిందండీ. ఆ మాట నేను చెప్పినా ఎవరూ  వినిపించుకోలేదండీ_"

    "ఏం దెయ్యం? కొరివి దెయ్యమా ?" (నవ్వులు)

    "కాదండి. సోమశేఖరంగారు దెయ్యమై పగపట్టారండి-"

    "శివయ్యా, నీకు దెయ్యాల్లో  నమ్మకం వుందా?"

    "నేను కళ్ళారా చూశాక నమ్మకుండా ఎలా వుంటానండి బాబూ!"

    "ఏం చూశావు నువ్వు?"

    "నేనాండి-?" అకస్మాత్తుగా  శివయ్య  కళ్ళు పెద్దవయ్యాయి. భయంగా  శూన్యంలోకి చూశాడు. క్రమక్రమంగా అతడి కనుగుడ్లు వెనక్కి  తిరిగిపోయాయి. అతడి స్వరం మారిపోయింది. డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టు  ఒక బొంగురు స్వరం  అతడి కంఠం ద్వారా వినిపించసాగింది.

    "శివయ్యే కాదు....మీరు కూడా చూడాలంటే  చూడవచ్చు....నేను సోమశేఖరాన్ని....!! నా కాంక్ష తీరింది....నా ప్రియురాలి ఆత్మతో కలిసి నేను దిగంతాలకి వెళ్ళిపోతున్నాను. శ....ల....వు."

    చరిత్రాత్మకమైన  ఆ కేసు వినటం  కోసం దేశం నలుమూలల్నించీ  వచ్చిన  ప్రజానీకం కోర్టుహాలు లోపల, కోర్టు బయట  నిశ్చేష్టులై  వుండగా  సాక్షి శివయ్య శరీరం బోనులో  క్రిందికి జారిపోయింది.


                                  *    *    *

    Exception to see. 302-Indian penal code-Insanity plea- Accused suffering from paranoid schizphernia can be called insane person-Acts done under insanity are no offence. 


                                                                     *    *    *


    "మీ పేరు?"

    "రామకృష్ణ."

    "మీరెక్కడ పనిచేస్తున్నారు?"

    "మెంటల్ ఆస్పత్రిలో - డిప్యూటీ సూపర్నెంట్ గా."

    "ముద్దాయి మానసిక పరిస్థితిమీద  మీ అభిప్రాయం?"

    "అతడు పారనాయిడ్ స్కిజో ఫ్రెనియాతో బాధపడుతున్నాడని నా ఉద్దేశ్యం."

    "దాన్నే  తెలుగులో  దెయ్యం పట్టటం  అంటారా" జవాబు చెప్పటానికి - రామకృష్ణ ఆగేడు. కోర్టులో  సూదిపడితే  వినబడేటంత నిశ్శబ్దం. ఆ మెంటల్ డాక్టర్ కాస్త ఆలోచించి అన్నాడు.

    "వెల్ - తెలుగులో  దాన్ని దెయ్యం  అంటారేమో  నాకు తెలీదు. ద్వంద్వ ప్రవృత్తి అనేది సరి అయిన పదం అనుకుంటాను. మీరు దాన్ని భ్రాంతి అని కూడా అనవచ్చు."

    "మీరిప్పుడు  మీ కళ్ళముందే- బోనులో  సాక్ష్యమిస్తున్న  ఆ ఇంటి నౌకరు శివయ్యని  దెయ్యం ఆవహించటం చూశారు. దీనికి మీరే కారణం చెపుతారు?"

    "సోమశేఖరం  ఆత్మహత్య  చేసుకుని మరణించాక  దెయ్యమయ్యాడని  శివయ్య  మనస్పూర్తిగా నమ్మేడు. తన ఇంటి యజమానిని  ఆ దెయ్యం అప్పుడప్పుడు  ఆవహిస్తోండటం  అతను కళ్ళారా  చూశాడు. అందువల్ల  కోర్టులో  అతడిని 'నువ్వెప్పుడన్నా  దెయ్యాన్ని  చూశావా' అని ప్రశ్నించగానే  ఆ భ్రాంతికి తానే స్వయంగా లోనయ్యాడు. చనిపోయిన సోమశేఖరం  కోర్కేమిటో  శివయ్యకు తెలుసు. అతడి ప్రియురాలు  మరణించాలనీ, ఆ ఆత్మ కూడా  తనలో కలిసి స్వర్గానికి రావాలని సోమశేఖరం కోర్కె! శివయ్య స్వర్గాన్నీ, దేవుణ్నీ నమ్ముతాడు. కాబట్టి  అసంకల్పితంగా - సోమశేఖరం ఆత్మ తనని పూనినట్టు  కోర్టులో  ప్రవర్తించాడు."

    "ముద్దాయి కూడా హత్యకి  ముందు దెయ్యం  పట్టినట్టు  అప్పుడప్పుడు  ప్రవర్తించేవాడా?"

    "అవును. ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరం  ఆత్మ తరచు అతడిని ఆవహించేది. తన ప్రియురాలి ఆత్మకి ఆమె శరీరం నుంచి విముక్తి కలిగించమని  అతడిని మానసికంగా  వత్తిడి చేసేది. దాన్నే దెయ్యం పట్టటం అని అనుకున్నారు."

    "కానీ ఒక డాక్టర్ గా మీరు మాత్రం  దాన్ని  పారనాయిడ్ స్కిజో ఫ్రెనియా అంటారు."

    "అవును."

    "ఆ మానసికమైన వత్తిడిలో  ముద్దాయికి తనేం చేస్తున్నదీ  తెలిసే ఆవకాశం వున్నదా ?"     


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS