Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 3


    "నీ చిక్కటి అనుభూతుల చీకటిలోనే    
    నే పురివిప్పిన వెన్నెల నవుతా!"
    నిజంగా ఆ అమ్మాయే మాట్లాడుతున్నట్లుంది. నిజంగా ఎవరి జీవితంలోనయినా సరే ఆ అమ్మాయి వెన్నెలే అవుతుంది.
    ఎప్పటికయినా, ఎన్నాళ్ళకయినా సరే ఆ వెన్నెలను కలుసుకోవాలి. ఆ అందాన్ని యావజ్జీవం సొంతం చేసుకోవాలి.
    టైపిస్ట్ వసుంధర వచ్చింది.
    ఆమెకు భవానీశంకర్ తో మాట్లాడడం చాలా థ్రిల్లింగ్ గా వుంది. అంతకు ముందెప్పుడూ అంత సరదాగా, అంత చక్కగా మాట్లాడే యువకులు తారసిల్ల లేదు. అంచేత ఏదొక పని కల్పించుకుని అతనితో మాట్లాడుతూనే ఉంటుంది సాయంత్రం వరకూ.
    "ఏమిటి ఆ బొమ్మవంక అలా చూస్తున్నారు?"
    భవానీశంకర్ కొంచెం సిగ్గుపడ్డాడు.
    "మళ్ళీ ఎవరితోనూ అనరుకదా!"
    "ఏ విషయం?"
    "ఇదే_ ఈ బొమ్మ విషయం."
    "ఏమిటి ఆ బొమ్మ విషయం?"
    "ఈ ఫోటోలో అమ్మాయిని నేను ప్రేమించాను."
    ఆమె నవ్వాపుకుంది.
    "ఎవరా అమ్మాయ్?"
    "అదే తెలీదు! నిన్నే దొరికిందీ కాగితం! బఠానీలవాడు ఇందులో బఠానీలు కట్టి యిచ్చాడు. చాలా అందంగా లేదూ?"
    "అందంగా కనబడినవన్నీ ప్రేమించేయటమేనా?"
    "అనీ కాదు మేడమ్! ఓన్లీ దిస్ గాళ్! ఇంత అందం ఇంకెక్కడా కనిపించలేదు నాకు! నిజంగా వెన్నెలే! కదూ"
    వసుంధరకు కొంచెం కోపం వచ్చింది. ఎదురుగ్గా వున్న అందాలు వదిలేసి అలా పాత పుస్తకంలోని ఓ పేజీ పట్టుకుని ప్రేమించాననే వారినేమనాలి?
    సరిగ్గా అప్పుడే చలపతి పిలవడంతో అక్కడినుంచి వెళ్ళిపోయిందామె. ఫోటోవంకే మళ్ళీ చూడసాగాడు భవానీశంకర్. చూస్తున్నకొద్దీ ఆ అమ్మాయి అందం పెరిగిపోతున్నట్లనిపించ సాగింది. దాంతోపాటు అతనిలో అశాంతి కూడా పెరిగిపోతోంది. ఎన్నాళ్ళిలా ఈ ఫోటోవంక చూస్తూ కూర్చోవటం? ఎన్నాళ్ళిలా ఈ దిక్కుమాలిన కాషియర్ ఉద్యోగం చేయటం? తనలాంటి డైనమిక్ యంగ్ ఫెలో హైద్రాబాద్ లో ఉంటేనేగానీ షైనవడని తన ఫ్రెండ్ జయకర్ చెప్పాడు. అదీగాక ఈ ఫోటోలోని అమ్మాయి వివరాలు కావాలంటే హైద్రాబాద్ లోనే దొరకవచ్చు. తెలుగు మాగజైన్స్ లో ఎక్కువభాగం అక్కడే ఉన్నాయ్.
    తన జీవితధ్యేయం ముందా అమ్మాయి వివరాలు తెలుసుకుని ఆమెను కలుసుకోవటం! అంతేగానీ ఈ అగర్వాల్ అండ్ అగర్వాల్ కంపెనీలో కాష్ లెక్కపెడుతూ రోజులు గడపటంకాదు.
    "హలో_"
    పలుకరింపు విని తన కెదురుగ్గా కుర్చీలో కూర్చున్న ఆకారాన్ని చూశాడు.
    "గుడీవినింగ్" అందా ఆకారం మళ్ళీ. అతన్నంతకు ముందు చూసిన గుర్తురావటం లేదు.
    "గుడీవినింగ్"
    "మీ దగ్గరున్న కాష్ చెక్ చేయడానికొచ్చాను" అందా ఆకారం మళ్ళీ.
    "కాష్ చెక్ చేస్తారా?"
    "అవును"
    "ఎందుకు?"
    "అది నా డ్యూటీ. నేను హెడ్డాఫీస్ నుంచి వచ్చాను."
    భవానీశంకర్ కి అర్థమయింది. హెడ్డాఫీస్ నుంచి ఇన్ స్పెక్షన్ కి ఎవరయినా వచ్చినప్పుడు కాష్ చెక్ చేస్తారని తనకు మామయ్య ముందే చెప్పాడు.
    "వెల్ కమ్ మైడియర్ ఫ్రెండ్! వెల్ కమ్!" అన్నాడు చిరునవ్వుతో.
    అతను సేఫ్ లోని డబ్బు తీసుకుని లెక్కపెట్టాడు.
    "అయిదువందలు తక్కువగా వుంది" అన్నాడు చిరునవ్వుతో.
    "తక్కువగా వుందా?" ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు భవానీశంకర్.
    "అవును. కావాలంటే మీరూ లెక్కపెట్టండి."
    "నో...నో...అక్కర్లేదు. మీ మాటమీద నాకు సెంట్ పర్సెంట్ నమ్మకం వుంది. మీకు తెలుసో తెలీదో అయ్ బిలీవ్ పీపుల్."
    "అయిదువందలూ ఏమయిందో చెబితే..."
    "డూ యూ నో సారధి? కాలేజీలో మా బెంచిలోనే కూర్చునేవాడు. వాడిని ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. అంత మోసం చేసేవాడు కాని నేను మాత్రం వాడిని నమ్మేవాడిని. వాడేం చెప్పినా ఓ.కే. అనేవాడిని. అంచేత ఏమయిందో తెలుసా? వాడు సెంట్ పర్సెంట్ పెద్దమనిషిగా మారిపోయాడు.
    "అయిదువందలూ ఏమయినట్లు?" వినిపించుకోకుండా అడిగాడతను.
    భవానీశంకర్ ఓ క్షణం ఆలోచించి ఠక్కున గుర్తొచ్చినట్లు అతని భుజంమీద చరిచాడు.
    "అహ్హహ్హహ్హ, గుర్తుకొచ్చేసింది. చూశారా! మన బ్రెయిన్ ఎంత షార్పో? ఎప్పుడూ ఇంతే. ఎన్ని సంవత్సరాలయినా క్రితం విషయమైనా సరే ఠకీమని గుర్తుకొచ్చేస్తూంది. అందాకా యెందుకు? హైస్కూల్లో చదివేప్పుడు ఫోర్తు బెంచీలో కూర్చునే రాజేశ్వర్ గాడు మొన్న మార్కెట్లో కనబడ్డాడు. వాడు నన్ను మర్చిపోయాడుగానీ నేను వాడిని వీపుమీద లాగికొట్టేశాను."
    "అయిదువందలూ ఏమయిందో చెప్తే?"
    భవానీశంకర్ అతనివేపు ఆశ్చర్యంగా చూశాడు.
    "అయిదువందలా? ఏ అయిదువందలు?"
    "కాష్ తక్కువున్న ఎమౌంట్."
    "ఓ! మీరింకా ఆ విషయం గురించే మాట్లాడుతున్నారన్నమాట! ఆ అయిదువందలూ శివానందం కిచ్చాను."
    "శివానందానికా?"
    "యస్! పూర్ ఫెలో! యాభయ్ వేలు గెల్చుకునే ఛాన్స్ ఆరుసార్లు మిస్సయిందట. ఎందుకో తెలుసా? ఇంతకుముందున్న కాషియర్ వట్టి ముసరుగాడు అవటం వల్ల. అలాంటి కసాయి వెధవల్ని కాషియర్ గా ఎట్లా ఎపాయింట్ చేస్తారో తెలీదు"
    "నేనే ఇంతకుముందు కాషియర్ని..." జేవురించిన మొఖంతో అన్నాడతను.
    భవానీశంకర్ కు ఓ క్షణం మాట రాలేదుగానీ చప్పున తేరుకుని చిరునవ్వు నవ్వాడు.
    "మీరా? అయితే శివానందం డెఫినెట్ గా మిమ్మల్ని అపార్థం చేసుకుని వుంటాడు. అయిదువందలు అతగాడి కివ్వకపోవటానికి అద్భుతమయిన కారణమేదో మీకు వుండే వుంటుంది."
    "ఆఫీస్ కాష్ ఇలా దుర్వినియోగం చేయకూడదని..."
    "తెలుసు బ్రదర్! తెలుసు. రూల్స్ వున్నాయ్. కానీ ఈ అర్థంలేని రూల్స్ వల్ల ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయో చూడండి! శివానందం యాభయ్ వేలు సంపాదించే ఛాన్స్ ఆరుసార్లు మిస్సయ్యాడు. ఎంత అమానుషమో ఆలోచించండి? అందుకే నేను ఈ రూల్స్ ని పక్కకు నెట్టి..."
    అతను లేచి నిలబడ్డాడు. "ఈ విషయం నేను హెడ్డాఫీసుకి తెలియజేస్తున్నాను"
    "అజ్ఞానం బ్రదర్! ఇది కేవలం మనిద్దరికే సంబంధించిన విషయం! మధ్యలో హెడ్డాఫీసు ఎందుకొస్తుంది? రాకూడదు! మనమంతా ఒక్కటి. "ఒకేజాతి_ ఒకే ప్రజ" అన్న ఎడ్వర్టయిజ్ మెంట్ టి.వి.లో చూళ్ళేదూ?"
    "అయామ్ సారీ!" అనేసి తిన్నగా మేనేజర్ బంగారయ్య రూంలో కెళ్ళాడతను.
    మరికాసేపట్లో వెంకటేశం వచ్చి నిలబడ్డాడు.
    "సార్! మేనేజర్ గారు పిలుస్తున్నారు."
    "బహుశా ఆ హెడ్డాఫీస్ పక్షి డబ్బు తక్కువుందని అశుభం పలికి వుంటాడు."
    "అవున్సార్!"
    "ఇలాంటి పక్షుల్ని ఏం చేయాలంటావ్?"
    "రోడ్డుమీద ఒక్కడే కనిపించినప్పుడు ఫట్ ఫట్ లాడించెయ్యాలండి"
    "ఒండర్ ఫుల్ అయిడియా మైడియర్ వెంకటేశం! ఎప్పుడయినా ఉపయోగించావా ఇది?"
    "ఇంతకుముందు ఉద్యోగం చేసినచోట దొంగబిల్లులు తీసుకొచ్చినందుకు మేనేజర్ నన్ను డిస్ మిస్ చేస్తే బయట వాడిని తుక్కు రేగ్గొట్టేశాన్సార్! వారం రోజులు గవర్నమెంట్ హాస్పటల్లో వున్నాడు."
    "సూపర్బ్ మైడియర్ వెంకటేశం! నీ చరిత్ర గవర్నమెంటు టెక్ట్స్ బుక్స్ లో లిఖింపతగింది"
    బంగారయ్య గదిలోనుంచి మళ్ళీ బెల్ మోగింది.
    భవానీశంకర్ లేచి అతని గదిలోకెళ్ళాడు.
    "భవానీ_యూ ఆర్ డిస్ మిస్ డ్" అన్నాడు బంగారయ్య కోపంగా.
    "డిస్ మిస్ డా? వెరీ స్ట్రేం జ్ అంకుల్! ఆఫ్టరాల్ అయిదొందలు తక్కువున్నందుకు డిస్ మిస్ లు చేస్తారా? వెరీ బాడ్_వెరీ బాడ్! విల్సన్ మూండ్సే ఇలాంటి సమయాల్లో అమలుచేస్తోన్న పాలసీ ఏమిటో తెలుసా మీకు?"
    "భవానీ ఇంక నువ్వు వెళ్ళవచ్చు."
    "అయిదొందలు తక్కువున్నందుకు ఆ కాషియర్ ని పిలిచి తన జేబులో నుంచి అయిదువందలిచ్చి అతని భుజం తడతాడు, "మిష్టర్ కాషియర్! భవిష్యత్తులో డబ్బు కావాలంటే నన్నడుగు! నేనిస్తాను. అంతే కానీ కాష్ లో తీసుకోకండి!" అంటాడు చిరునవ్వుతో. ఎంత సూపర్బ్ గా వుందో ఒక్కసారి ఆలోచించు అంకుల్!"
    "ఇంక నువ్వు వెళ్ళిపో ఇంటికి."
    భవానీశంకర్ ఇంక వాదించదల్చుకోలేదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS