Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 4


    నెమ్మదిగా ఆఫీసులోనుంచి బయటికొచ్చాడు. ఒక్కసారిగా ఎక్కడ లేని ఉత్సాహమూ ఆవరించిందతనిలో.
    వెధవ అకౌంట్ పుస్తకాలూ, డబ్బు లెక్కపెట్టుకోవటం ఈ రెండింటి బెడదా తప్పిపోయింది. ఎవరో రిటైరయిపోయినవాళ్ళు, నడవడానికి శక్తిలేనివాళ్ళూ కూర్చుని చేసే ఉద్యోగాలవి. తనలాంటి డైనమిక్ యంగ్ ఫెలోస్ కోసం కాదు.
    రోడ్డుమీదకొచ్చి నెమ్మదిగా గవర్నరుపేట సెంటర్ వేపు నడవసాగాడతను. ఆఫీస్ టైమయిపోవడంచేత అందరూ వెనకేవచ్చి అతనిచుట్టూ మూగారు.
    "ఆ శివానందాన్ని నమ్మవద్దూ అని ముందే చెప్పాం!" అన్నాడు రాఘవులు.
    "మాకు రేపట్నుంచి టైమ్ పాస్ అవటం చాలా కష్టం" అన్నాడు రాజు.
    అందరూ వెళ్ళిపోయాక వసుంధరతోపాటు బస్ స్టాప్ వేపు నడవ సాగాడతను.
    "మీ ఉద్యోగం పోవటం నాకెంతో బాధగా వుంది!" అంది వసుంధర.
    "నాకెంతో సంతోషంగా వుంది!" నవ్వుతూ అన్నాడు భవానీశంకర్.
    ఆమె తెల్లబోయింది.
    "రియల్లీ?"
    "అవును! కారణం ఏమిటో తెలుసా? ఇక్కడే కూర్చుని ఉద్యోగం చేస్తూంటే ఈ లవ్ గాడెన్ ని వెతుక్కునేదెప్పుడు?" జేబులో నుంచి చిత్తు కాగితం తీసి అందులోని అమ్మాయి ఫోటో చూపుతూ అన్నాడతను.
    వసుంధర అతనివేపు సందిగ్ధంగా చూసింది.
    "మీరు...నిజంగానే...ఆ బొమ్మని ప్రేమిస్తున్నారా?" నమ్మలేనట్లుగా అడిగింది.
    "ఇది బొమ్మ కాదు మేడమ్! ఫోటో_వెన్నెల."
    "అయినాగానీ అలా చిత్తుకాగితంమీద ఫోటోని చూసి ప్రేమించటం..."
    "లవ్ ఈజ్ బ్లయిండ్ అన్నారు మేడమ్. బహుశా నాలాంటివాళ్ళను చూసే అని వుంటారు_"
    ఆమెకు ఉక్రోషం, కోపం రెండూ వస్తున్నాయ్.
    "యూ ఆర్ మాడ్" అంది హేళనగా.
    భవానీశంకర్ నవ్వాడు.
    "యస్! అయామ్ మాడ్ ఆఫ్టర్ దిస్ గాళ్"
    ఆమె బస్ స్టాప్ దగ్గర ఆగిపోయింది.
    "ఓ.కే. వసుంధరాజీ. మళ్ళీ ఎప్పుడో, ఎక్కడో కలుసుకుందాం" ఆ కాగితం జేబులో పెట్టుకుంటూ అని ముందుకి నడిచాడతను. నాలుగడుగులు వేశాడో లేదో శివానందం రోడ్డుపక్కనే సోడా తాగుతూ కనిపించాడు.
    "హలో గురూ! సమయానికి కనిపించావ్. ఇంకో అయిదొందలు కొట్టగలవా? రేపు మాణింగ్...సారీ ఈవెనింగ్ ఇచ్చేస్తాను మొత్తం."
    "నా దగ్గరెక్కడిది?"
    "తాళం చేతులు నీ దగ్గరే ఉంటాయ్ గా! ఆఫీస్ కాష్ పట్టుకురా! రేపు 'స్టాబెర్రీ' పరుగెడుతోంది. బెంగుళూరులో దున్నేసిందది! దాని జాకీ ఎవరో తెలుసా? జానీ."
    "నా ఉద్యోగం పోయింది. నీకు అయిదొందలు ఇచ్చినందుకు"
    శివానందం ఆశ్చర్యపోయాడు.
    "పోయిందా?"
    "యస్."
    "రాటెన్_పోతేపోనీ! నేను పట్టే బిజినెస్ లో ఇస్తానులే. ఇంతకూ ఇప్పుడు నాక్కావలసిన అయిదొందల సంగతేమిటి? మీ అంకుల్ ని అడిగి చూడరాదూ? అనవసరంగా యాభయ్ వేలు పోగొట్టుకోవటం నాకిష్టంలేదు."
    భవానీశంకర్ అక్కడినుంచి బయలుదేరాడు ఇక లాభంలేదని.
    "హలో ఫ్రెండ్! అలా వెళ్ళిపోతే ఎలా గురూ. అయిదొందలు... గురూ_గురూ"
    భవానీశంకర్ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే బంగారయ్య హాల్లో కూర్చుని అతనికోసం ఎదురుచూస్తున్నాడు.
    "రా! నీకోసమే చూస్తున్నాను. ఇలా కూర్చో."
    భవానీశంకర్ అతనికెదురుగ్గా కూర్చున్నాడు.
    "భవానీ_ నిజంగా చెప్తున్నాను. నీతో ఫెడప్ అయిపోయాను. నువ్వు బాగుపడాలంటే నీ జీవితం నువ్వు గడుపుకోవాలి. నీ మంచిచెడ్డలు, నీ కష్టనష్టాలు అన్నీ నువ్వే చూసుకోవాలి."
    "కానీ యిప్పుడు అన్నీ సవ్యంగానే వున్నాయ్ కదంకుల్?"
    "మధ్యలో మాట్లాడకు! నిన్నగాక మొన్నేకదా వాడెవడికో దొంగ వెధవకి నువ్వు చిట్ ఫండ్ షూరిటీ ఉన్నావని వాళ్ళు వచ్చి నా సామానంతా లాక్కుపోతుంటే నేను రెండువేల ఆరొందలు కట్టింది?"
    "వాడు దొంగవెధవ కాదంకుల్! థరో జెంటిల్మెన్. ఎటొచ్చీ కొంచెం ఫైనాన్స్ ఎడ్జస్టవక చిట్ కట్టలేకపోయాడట. మన డబ్బు మనకి పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానన్నాడు. నేనే అక్కర్లేదని చెప్పాను. ఆఫ్టరాల్ రెండువేల ఆరొందలు మా అంకుల్ కి ఓ లెక్క కాదని చెప్పాను.
    "సిగ్గు లేకపోతే సరి!" కోపంగా అన్నాడు బంగారయ్య.
    "ఎందుకని అంకుల్?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
    "నా బొందకని! సరే పాతవన్నీ వదిలేసెయ్. ఇప్పుడు తవ్వుకుంటే నా గుండె పగిలిపోతుంది."
    "ఓ.కె. అంకుల్! నా పాలసీ కూడా అదే! పాస్ట్ ఈజ్ పాస్ట్! అందుకే ఎప్పటికప్పుడు పాతవన్నీ మర్చిపోతుంటాను."
    "మధ్యలో మాట్లాడకు__ నువ్వు ఈ రాత్రికి హైద్రాబాద్ వెళుతున్నావ్..."
    "హైద్రాబాదా?" ఆనందంగా అడిగాడు భవానీశంకర్.
    "అవును! అక్కడ నా ఫ్రెండ్ సాంబమూర్తిని కలుసుకో! అతను నీకు ఏదొక ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆ ఉద్యోగం సరిగ్గా చేసుకుంటావో, లేదో నీ ఇష్టం! కానీ ఏ పరిస్థితుల్లోనూ నీ మొఖం నాకు చూపించకు మళ్ళీ తెలిసిందా?"
    "అప్పుడప్పుడూ..."
    "మధ్యలో మాట్లాడకు! ఇదిగో! ఈ కవర్లో సాంబమూర్తికి నేను రాసిన లెటర్ ఉంది! ఈ రెండో కవరులో నీకు ఓ నెలరోజులు ఖర్చులకుగాను వెయ్యిరూపాయలు ఇస్తున్నాను. నేను చెప్పినదంతా అర్ధమయిందా?"
    "అయిందంకుల్."
    "అయితే ఇంక రడీ అవ్! నువ్వెంత త్వరగా ఈ ఇల్లు వదిలితే నాకు అంత మనశ్శాంతిగా ఉంటుంది."
    "ఓకే అంకుల్! థాంక్యూ!..."
    భవానీశంకర్ లేచి కవర్లు అందుకుని తన గదిలోకెళ్ళాడు. మరో గంటలో బస్ స్టాండ్ లో ఉన్నాడతను. అతనికిప్పుడు అపరిమితమయిన ఆనందంగా ఉంది. హైద్రాబాద్ లో ఒండర్ ఫుల్ లైఫ్ గడుపబోతున్నాడు తను. ఎందుకంటే తన జీవితం తాలూకూ వెన్నెల అక్కడే ఉండి ఉంటుందని తన నమ్మకం.


                                             *    *    *    *


    హైద్రాబాద్ బస్ స్టాండ్ లో దిగుతూనే మురికితోనూ, చెత్తతోనూ నిండిపోయిన రోడ్డు చూశాడు భవానీశంకర్. ఆ చెత్తపైన 'సుందరమైన నగరం మనది' అన్న బోర్డ్ కనబడుతోంది. ఆటోవాళ్ళు అతనిని చుట్టుముట్టేశారు.
    "అచ్ఛా లాడ్జింగ్ కో లే జాయేంగేసాబ్" అంటూ హడావుడి చేసేస్తున్నారు.
    చివరకు ఓ డ్రైవర్ సూట్ కేస్ లాక్కుని తన ఆటోలో పెట్టుకునేసరికి భవానీశంకర్ ఆ ఆటో ఎక్కక తప్పలేదు.
    కొద్దినిముషాల్లో కోఠీలోని ఓ హోటల్ ముందాగింది ఆటో. వంద రూపాయలు అడ్వాన్స్ కట్టి రూమ్ తీసుకున్నాడతను.
    స్నానం చేస్తూండగా తలుపు తట్టిన చప్పుడయింది. టవల్ కట్టుకుని వెళ్ళి తలుపు తెరచాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS